కేబినెట్ సమావేశానికి ఇవాళ కూడ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరు కాలేదు. వరుసగా రెండు కేబినెట్ సమావేశాలకు కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి కిషన్ రెడ్డి బుధవారంనాడు కూడ హాజరు కాలేదు. గత వారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడ ఆయన హాజరు కాలేదు. ఇవాళ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు.
ఈ నెల 4వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు. ఇప్పటివరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్రమంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించే వరకు తాను మంత్రి పదవిలో కొనసాగుతానని కిషన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపైనే ఎక్కువగా కేంద్రీకరించారు.
తన శాఖకు చెందిన కార్యక్రమాలపై అంతగా ఫోకస్ చేయలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత ఈ నెల 8న వరంగల్ లో జరిగిన ప్రధాని మోడీ టూర్ ను విజయవంతం చేయడంలో కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రెండో దఫా కేబినెట్ సమావేశం జరుగుతుంది. వరుసగా రెండు సమావేశాలకు కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. గత సమావేశానికి అనారోగ్య కారణాలతో హాజరు కాలేదని కిషన్ రెడ్డి సమాచారం పంపారు. అయితే ఇవాళ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
also read:కేంద్ర కేబినెట్ భేటీ: కిషన్ రెడ్డి దూరం, రాజీనామా చేస్తారా?
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దీంతో సంస్థాగత మార్పులకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుతం నెలకొంది.