తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ విక్రయించిన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాల భూమిని తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.సోమవారంనాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.పేదల భూములను వ్యాపారులకు కట్టబెడుతున్నారని కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ అవసరాల కోసం అవసరమైన డబ్బులను సమకూర్చుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం భూములను విక్రయిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రెండు పార్టీలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ప్రభుత్వ భూముల వేలాన్ని బీజేపీ అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ భూముల విక్రయం ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా ఉందన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం ప్రజలను మోసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును అగంట్లో అమ్మడాన్ని దుర్మార్గపు చర్యగా కేంద్ర మంత్రి అభివర్ణించారు.
సంపద సృష్టించాలి కానీ ప్రభుత్వ భూములను అమ్ముకుంటే పోతే వ్యవస్థలు కుప్ప కులుతాయని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివింది దీనికోసమేనా అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనుల కోసం, పేదలకు ఇండ్లు నిర్మించేందుకు స్థలాలు దొరకవన్నారు. కానీ పెద్ద పెద్ద వ్యాపారులకు విక్రయించేందుకు ప్రభుత్వ స్థలం ఎక్కడనుండి వస్తుందని ఆయన ప్రశ్నించారు.
భవిష్యత్తుకు, భావితరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్మడం సరైన నిర్ణయం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి 10 ఎకరాలు భూమిని కేసీఆర్ సర్కార్ కేటాయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు ఉపయోగ పడే సైన్స్ సిటీ కి భూమి ఇవ్వమంటే ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుమ్మక్కై అక్రమంగా భూములు పంచుకుంటున్నారన్నారు.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూములు అమ్మితే నేటి మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ వ్యతిరేకించిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.కానీ నేడు అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ భూములు విక్రయిస్తుందని ఆయన విమర్శించారు.