తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చేసిన అవినీతిపై దర్యాప్తు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు.
నిర్మల్:తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతిపై విచారణ చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచుతామని కిషన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభాన్ని పురస్కరించుకొని భైంసా సమీపంలో మంగళవారంనాడు సభను నిర్వహించారు.ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.పోలీసులు కళ్లు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. .కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తప్పులు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తున్న పార్టీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసీఆర్ సర్కార్ పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే జైలుకు కూడా వెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రను కూడా అడ్డుకొనే ప్రయత్నించారని కేసీఆర్ సర్కార్ పై ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి బీజేపీని అడ్డుకొంటానని కేసీఆర్ కలలు కంటున్నాడని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వెయ్యి మంది కేసీఆర్ లు, వెయ్యి మంది అసదుద్దీన్ ఓవైసీలు వచ్చినా కూడ మోడీని ఓడించలేరన్నారు.
కేసీఆర్ కు రాజకీయ పార్టీలపై గౌరవం ఉండదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదన్నారు. ఉద్యమాలను అణచివేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదన్నారు.తెలంగాణ గవర్నర్ మహిళా అని చూడకుండా ఆమెను అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.యాత్రలను అడ్డుకుంటున్నారని కేసీఆర్ తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. అంతేకాదు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
also read:ప్రతిపక్షాల గొంతు నొక్కడమే: వైఎస్ షర్మిలపై పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఇసుక , గ్రానైట్, సున్నపు క్వారీలు కల్వకుంట్ల కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఎక్కడ భూములు కన్పిస్తే ధరణి పేరుతో ఆక్రమించుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ దళిత బంధును తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.