డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్: కల్వకుంట్ల ఎమర్జెన్సీలో ఉన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
అమెరికా పర్యటనను ముగించుకొని గురువారంనాడు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కిషన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్దే అడ్డుకొనేందుకు పోలీసులు మోహరించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పేదల సమస్యలపై పోరాటంలో రాజీపడబోమన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తాము ముందుకు సాగుతామన్నారు. ఎంతమందిని అరెస్టు చేసినా తమ పోరాటం సాగుతుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎంత మందినైనా జైళ్లలో పెట్టుకోవాలని కిషన్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు.
10 ఎకరాల్లో కేసీఆర్ అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నారన్నారు. కానీ పేదలకు ఒక్క ఇళ్లైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల ప్రభుత్వంలో పేదల ఆశలు అడియాశలయ్యాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయినా కూడ పేదలకు ఒక్క ఇళ్లు కూడ నిర్మించలేదన్నారు.
also read:బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బీజేపీ: ఈటల, డీకే అరుణ హౌస్ అరెస్ట్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్ధామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఎక్కడికక్కడే బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆఖరికి తమ పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడ పోలీసులు అడ్డుకున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల ఎమర్జెన్సీలో ఉన్నామా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేసే హక్కు తమకు లేదా అని కిషన్ రెడ్డి అడిగారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసే వరకు తాము వదిలే ప్రసక్తే లేదన్నారు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో తెలంగాణ విలవిల్లాడిపోతుందన్నారు.