అవినీతి బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే సీబీఐకి రాష్ట్రంలో గతంలో ఇచ్చిన అనుమతిని కేసీఆర్ సర్కార్ రద్దు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్:తమ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే సీబీఐ దర్యాప్తునకు అనుమతిని రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సీబీఐ రాకుండా ఆపగలరేమో కానీ మునుగోడులో మాత్రం తమ గెలుపును ఆపలేరని ఆయన చెప్పారు.వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.అవినీతి సంపద నుండి రక్షణ కోసం సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకొన్నారని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. ఎన్ని చేసినా కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుండి కేసీఆర్ తప్పించుకోలేదరన్నారు. దుబ్బాక, హుజూరాబాద్,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులో వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.తెలంగాణలో టీఆర్ఎస్ కు పాతర వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలతో రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ:కేసీఆర్ పై బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో కేసుల విచారణ కోసం గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 30 వతేదీన జీవోను జారీ చేసింది. ఈ జీవో విషయాన్ని నిన్న హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. దీంతో సీబీఐకి అనుమతిని రద్దు చేసిన విషయం బయటకురాలేదు. ఈ జీవోను ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తమ కుటుంబసభ్యులపై ఆరోపణలు రావడంతో సీబీఐకి అనుమతిని నిరాకరిస్తూ జీవో జారీ చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.