ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు
హైదరాబాద్: సానుభూతి కోసం కల్వకుంట్ల కవిత డ్రామా చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారంనాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇవాళ బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్, కవితలు చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కౌంటరిచ్చారు. కవితకు ఈడీ నోటీసులపై బీజేపీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
నీతివంతులైతే, అక్రమ మద్యం వ్యాపారం చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు లక్షల రూపాయాల విలువైన సెల్ ఫోన్లను ధ్వంసం చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టార్గెట్ చేయాల్సిన పెద్దోళ్ళు మీరు కాదని కవితను ఉద్దేశించి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీకై మీరొచ్చి లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోయారని కిషన్ రెడ్డి చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు రావడంతో మహిళా రిజర్వేషన్ అంశం కవితకు గుర్తుకు వచ్చిందన్నారు. లేకపోతే మహిళా రిజర్వేషన్ అంశం బీఆర్ఎస్ నేతలకు ఏం అవసరమని ఆయన ప్రశ్నించారు.అబద్దాలు మాట్లాడడంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారు ఎవరూ లేరన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని బీజేపీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేయాలని తెలంగాణ ప్రజలు మీకు చెప్పారా అని కవితను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కవిత తీరుతో తెలంగాణ పరువు పోయిందని ప్రజలు బాధపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన సోదరి కవిత మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అబద్దాలు మాట్లాడారని కిషన్ రెడ్డి చెప్పారు.
also read:ప్రారంభమైన తెలంగాణ కేబినెట్: కవితకు ఈడీ నోటీసులు సహా కీలకాంశాలపై చర్చ
తొలి ఐదేళ్లలో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేని విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి పార్టీకి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు.మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నందునే ప్రజల దృష్టిని మరల్చేందుకు మహిళా రిజర్వేషన్ పై ఆందోళనకు కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని కిషన్ రెడ్డి చెప్పారు శాసనమండలిలో బీఆర్ఎస్ ఎంతమంది మహిళలకు అవకాశం కల్పించిందో చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు.రాజ్యసభలో ఒక్క మహిళా ఎంపీని కూడా పంపని మీరు రిజర్వేషన్ల గురించి ఎలా మాట్లాడుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.దర్యాప్తు సంస్థలు ప్రతి రోజూ ఏం చేస్తున్నాయో కేంద్ర ప్రభుత్వానికి తెలియదన్నారు. దర్యాప్తు సంస్థలు తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తాయన్నారు.