కేసీఆర్ చెప్పినా నితీష్ పట్టించుకోలేదు, నవ్వుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Sep 1, 2022, 5:17 PM IST

కేసీఆర్ చెప్పే మాటలు విని అందరూ నవ్వుకునే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఓటమి చెందుతామని తెలిసి ఇతర రాష్ట్రాల వెంట కేసీఆర్ తిరుగుతున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేసుకొంటూ కేసీఆర్ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.


హైదరాబాద్:  కేసీఆర్ మాటలు విని అందరూ నవ్వుకునే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  నిన్నపాట్నా లో  మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో కేసీఆర్ కోరినా పట్టించుకోకుండా బీహర్ సీఎం  నితీష్ కుమార్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గురువారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పదే పదే కోరినా కూడా నితీష్ కుమార్ కూర్చోవడానికి అయిష్టత ప్రదర్శించారని కిషన్ రెడ్డి  గుర్తు చేశారు. ఇద్దరు నేతలు కలిసి కూర్చోలేని పరిస్థితి విపక్ష పార్టీల్లో నెలకొందన్నారు. అలాంటి నేతలందరిని కేసీఆర్ ఎలా ఏకతాటిపైకి తెస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

 కేసీఆర్ వ్యవహరంతో తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు.తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించామని దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాత్రం సమస్యలు అలానే ఉన్నాయని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను ఉద్దరించామని గొప్పలు చెప్పుకుంటూ కేసీఆర్ దేశంలో పర్యటిస్తున్నారన్నారు. తెలంగాణ మోడల్ ఆదర్శమని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి  విమర్శించారు.  యూపీ, పంజాబ్, ఢిల్లీ, బీహర్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో  విపక్ష పార్టీలను కేసీఆర్ కలిశారన్నారు. కేసీఆర్ మాటలను విపక్షాలకు చెందిన   ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి కల్వకుంట్ల కుటుంబమే దిక్కు అన్నట్టుగా కేసీఆర్ ప్రచారం చేసుకోవడాన్ని కిషన్ రెడ్డి తప్పు బట్టారు. 

Latest Videos

undefined

వంట నూనె నుండి రక్షణ రంగంలో వినియోగించే ఆయుధాలను కూడా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద దేశంలోనే తయారు చేస్తున్నామని కిషన్ రెడ్డి  చెప్పారు. మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను  ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని కిషన్ రెడ్డి  చెప్పారు. దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గాయని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  తెలంగాణ మోడల్ అంటే  ఐదేళ్ల మహిళా మంత్రి మోడలా అని ప్రశ్నించారు. తెలంగాణ  మోడల్ అంటే ప్రజలకు సీఎం అందుబాటులో ఉండడమా అని ఆయన అడిగాడు.ధర్నాలు చేసుకొనేందుకు గాను హైకోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో చోటు చేసుకుందని కిషన్ రెడ్డి చెప్పారు. 

ముఖ్యమైన 15 ప్రభుత్వ శాఖలను కల్వకుంట్ల కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక వ్యవహరించిన వారిని ప్రగతి భవన్ నుండి పంపారని కిషన్ రెడ్డి విమర్శించారు.  ప్రస్తుతం తెలంగాణ వ్యతిరేక శక్తులను తన వెంట పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు..  అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలను పక్కన పెట్టుకుని మత ఘర్షణల గురించి  కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైద్రాబాద్ లో ఇటీవల జరిగిన గొడవలకు కేసీఆర్ కుటుంబం కారణమైందన్నారు.  మునావర్  కామెడీ షో ను పట్టుబట్టి నిర్వహించడంలో అర్ధం లేదన్నారు. హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులకు కేసీఆర్ కుటుంబం కారణం కాదా ఆయన అడిగారు. దేశ వ్యాప్తంగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల  ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలన్నారు. 

కేసీఆర్ వంటి తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈడీ, సీబీఐ గురించి కేసీఆర్  ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారన్నారు..తప్పు చేయకపోతే దర్యాప్తు సంస్థల గురించి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని  కేసీఆర్ ను ప్రశ్నించారు.. భవిష్యత్తులో ఏదైనా కేసీఆర్ కుటుంబంపై సీబీఐ దాడులు జరిగితే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన అడిగారు. తెలంగాణలో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని అర్ధమై కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.. వచ్చే టీఆర్ఎస్  ఓటమి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  అధికారంలో ఉన్నన్ని రోజులైనా మంచిగా పాలన చేయాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కేసీఆర్ కు సూచించారు. 

also read:కేసీఆర్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయేందుకు సిద్దమైన నితీష్.. బీజేపీ సెటైర్లు.. అసలేం జరిగిందంటే..?

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల విషయాన్ని ఎన్నికల సంఘం చూసకుంటుందన్నారు. ఈ విషయచమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదన్నారు.ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయించారనే ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు విభజన సమస్యలను పరిష్కరించే క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. 
 

click me!