నియంత కేసీఆర్ ను గద్దెదించడానికే..: ఈటల బిజెపిలో చేరికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published May 31, 2021, 2:50 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికపై పార్టీలో సానుకూల వాతావరణం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజిపిలో చేరికను ముఖ్యనేతలతో సహా అందరూ స్వాగతిస్తున్నారని... పార్టీలో సానుకూల వాతావరణం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం కావడానికి అందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.

అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు సహజమని... తమ పార్టీలోనూ సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి చెందారన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు. పార్టీ అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రాన తాను స్పందించాల్సి‌న అవసరం లేదన్నారు. 

నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు తనతోనూ చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచిని.. ప్రధాని మోదీకి చెడును ఆపాదించటం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో... కేంద్ర ఏం చేస్తుందో ప్రజలకు తెలుసని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

read more  ఇంత నిర్భంధం ఉంటే ఉద్యమం సాగేదా?: కేసీఆర్‌ కంటే కిరణే మేలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈటల రాజేందర్ హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఆయన ఆదివారం ఢిల్లీకి బయల్దేరడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చ మొదలయ్యింది. ఆయన వెంట టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వున్నారు. ఇవాళే ఈటల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షులు జెపి నడ్డా చేతులమీదుగా కాషాయ కండువా కప్పుకుని బిజెపిలో చేరనున్నట్లు సమాచారం. 

భూకబ్జా ఆరోపణలు రావడంతో కేబినెట్ నుండి ఈటల రాజేందర్ ను  కేబినెట్ నుండి కేసీఆర్ తప్పించారు. దీంతో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఈటల రాజేందర్ ను కలిశారు. గతకొన్ని రోజులుగా ఆయన  బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. అటు బీజేపీ హైకమాండ్ కూడా ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉందనే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈటల డిల్లీకి వెళ్లడంతో బిజెపిలో చేరిక ఖాయమైంది. 

click me!