నిండు గర్భిణికి కరోనా... తల్లీ, బిడ్డ ఇద్దరూ మృతి

By Arun Kumar PFirst Published May 31, 2021, 1:22 PM IST
Highlights

 కరోనా మహమ్మారి తల్లీబిడ్డల ప్రాణాలను బలితీసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  

మహబూబాబాద్: కరోనా బారినపడ్డ నిండు గర్భిణి మృతిచెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పుట్టిన చంటిపాప కూడా మరణించింది. ఇలా కరోనా మహమ్మారి తల్లీబిడ్డల ప్రాణాలను బలితీసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  

ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన ధరావత్ కొమ్మాలు, కాళీ దంపతులు. వీరికి సరిత(23), దివాకర్ సంతానం. అయితే సరితకు ఖానాపురం మండలం ధర్మరావుపేటకు చెందిన యువకుడితో వివాహం అయ్యింది. 

సరిత గర్భవతి కావడంతో ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. అయితే తల్లి దండ్రులు, సోదరుడితో పాటు నిండు గర్భవతి అయిన ఆమె కూడా కరోనా బారినపడ్డారు. దీంతో వైద్యం కోసం వారంతా మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే సరిత గర్భవతి కావడంతో మరింత మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని మరో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఓ ఆడబిడ్డకు జన్మనివ్వగా 3 రోజుల క్రితం పాప, శనివారం సరిత చనిపోయింది. 

read more  తెలంగాణలో జూన్ 10 వరకు లాక్‌డౌన్ ... మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు

ఇదిలావుంటే ఆదివారం ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 24గంటల్లో కరోనాతో 16 మంది మరణించారు. మొత్తం 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 3,660 మంది కరోనా నుంచి కోలుకోన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,75,827 మందికి వైరస్ సోకగా.. 5,37,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,042 యాక్టీవ్ కేసులున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,263కి చేరింది. రికవరీ రేటు 93.34 శాతానికి పెరిగింది. ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 390 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 75, జగిత్యాల 49, జనగామ  15, జయశంకర్ భూపాలపల్లి 29, గద్వాల 25, కామారెడ్డి  4, కరీంనగర్ 92, ఖమ్మం 82, మహబూబ్‌నగర్ 69, ఆసిఫాబాద్ 9, మహబూబాబాద్ 60, మంచిర్యాల 47, మెదక్ 15, మేడ్చల్ మల్కాజిగిరి 101, ములుగు 12, నాగర్ కర్నూల్ 38, నల్గగొండ 45, నారాయణపేట 10, నిర్మల్ 3, నిజామాబాద్ 19, పెద్దపల్లి 68, సిరిసిల్ల 26, రంగారెడ్డి 114, సిద్దిపేట 76, సంగారెడ్డి 68, సూర్యాపేట 29, వికారాబాద్ 50, వనపర్తి 55, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

click me!