
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి (ambedkar vardhanthi) సందర్భంగా దళిత బంధు పథకంపై (Dalit Bandhu) కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళితులను మభ్య పెట్టారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల తర్వాత దళిత బంధు ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దళితులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే తక్షణమే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ వర్దంతి సందర్భంగా.. ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ వర్దంతి సందర్బంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చెప్పారు.
ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు కొన్ని నెలల ముందు సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హుజురాబాద్‌లో ఫైలట్ ప్రాజెక్టు దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో పలువురు లబ్దిదారులకు దళిత బంధు చెక్కులను అందజేశారు. దళిత బంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడటం.. కోడ్ అమల్లోకి రావడంతో దళిత బంధు అమలును ఎన్నికల సంఘం నిలిపివేయాలని ఆదేశించింది.
అయితే ఈ క్రమంలోనే మాట్లాడిన దళిత బంధు నిరంత ప్రక్రియ అని.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత దళిత బంధును కొనసాగిస్తామని చెప్పారు. అయితే హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత దళిత బంధు అమలుపై బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి నెల రోజులు గడిచిన కూడా సీఎం కేసీఆర్ దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తున్నారు.