Etela Rajenderకు చెందిన జమునా హేచరీస్ భూ కబ్జాకు పాల్పడింది నిజమే.. వెల్లడించిన మెదక్ కలెక్టర్

By team teluguFirst Published Dec 6, 2021, 1:30 PM IST
Highlights

మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) కుటుంబానికి చెందిన జమున హేచరీస్ (jamuna hatcheries) భూ కబ్జాకు పాల్పడింది వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.

మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలంలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ (jamuna hatcheries) భూములపై ఇటీవల అధికారులు సర్వే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ వెల్లడించారు. జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసినట్టుగా తేలిందన్నారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్టుగా గుర్తించినట్టుగా చెప్పారు. ఎల్క చెరువు, హల్దీవాగులోకి పౌల్ట్రీ వ్యర్థాలు విడుదల చేస్తున్నట్టుగా స్థానికుల ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. 

‘మాసాయిపేట మండలంలో అచ్చంపేట, హకీంపేట మండలాలోని 70.33 ఎకరాల సీలింగ్, అసైన్డ్ భూములను కబ్జా చేసినట్టుగా సర్వేలో తేలింది. జమునా హేచరీస్ అక్రమంగా ఈ భూమిని కబ్జా చేసింది. ఇందులో కొన్ని రిజిస్ట్రేషన్‌లు కూడా జరిగాయి. సర్వే నెంబర్ 81లో 5 ఎకరాల వరకు, 130లో 3 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తంగా 56 మంది అసైనీల భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు తేలింది. ఇదంతా పలుకుబడితో, బలవంతంగా జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సేల్ డీడ్స్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్ హరీష్ తెలిపారు. 

అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలను వాడుతున్నట్టుగా కలెక్టర్ చెప్పారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేశారని తెలిపారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు.. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్‌లు నిర్మించినట్టుగా గుర్తించడం జరిగిందన్నారు. అసెన్ట్ భుముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై నివేదికం పంపినట్టుగా చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, సహకరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ భూములు కబ్జా చేసినట్టుగా రైతులు చేసిన ఆరోపణలు నిజమని తేలింది. బాధితులకు న్యాయం చేసేలా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టుగా తెలిపారు. 

click me!