లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వుంటుందని కేంద్ర మంత్రి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్ వుందని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఎ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ అనుకున్న స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కొన్ని చోట్ల 2, 3 స్థానాల్లో నిలవడం.. ఓటింగ్ శాతం మెరుగుపడటం ఊరట కలిగించే అంశం. కాస్త కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యం ఏం కాదనే భావన కమలనాథుల్లో ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకుని మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బీజేపీ బలపడుతోంది. ఈ జోరును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కమలనాథులు కృత నిశ్చయంతో వున్నారు.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వుంటుందని కేంద్ర మంత్రి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ నెల 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారని, మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలు ఈ భేటీకి వస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
90 రోజుల యాక్షన్ ప్లాన్ వుందని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని విధంగా మోడీ హ్యాట్రిక్ కొడతారని.. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2019తో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలోని ప్రతి ఇంట్లో మోడీపై చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగమవుతామని కిషన్ రెడ్డి చెప్పారు.