ప్రశ్నించే గొంతులను కేసీఆర్ సర్కార్ అణచివేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ ప్రభుత్వం బందీగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నాడు జాతీయ పతాకాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం విచ్చల విడిగా లిక్కర్ అమ్మకాలను కేసీఆర్ సర్కార్ ప్రోత్సహిస్తుందన్నారు. కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం మద్యంతో నిండిపోయిందన్నారు. మద్యం కారణంగా అనేక మంది రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారన్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని మహిళ సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మెజారిటీ మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలో అత్యధిక అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన ఆరోపించారు. వాటాలు, కమీషన్ల రూపంలో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆయన చెప్పారు. దేశంలోని విపక్ష పార్టీలకు ఎన్నికల్లో ఫైనాన్స్ చేస్తామని కేసీఆర్ చేసినట్టుగా ప్రచారం సాగిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ కల్వకుంట్ల కుటుంబ దోపీడీకి ఇది పరాకాష్టగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యాపారంలో కేసీఆర్ సర్కార్ 30 శాతం వాటా తీసుకుంటుందని కేంద్ర మంత్రి ఆరోపించారు. బలవంతంగా బెదిరించి తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
Live: Independence Day celebrations; Hoisting the National Flag at State HQ, Nampally, Hyderabad. https://t.co/57hUhQlwbs
— G Kishan Reddy (@kishanreddybjp)ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారన్నారు. పౌర హక్కులను కాలరాస్తున్నారని ఆయన కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఉద్యమ కారులను, రాజకీయ పార్టీల కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజా స్వామ్య వ్యతిరేక ప్రభుత్వం కేసీఆర్ సర్కారే అని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగుతుందన్నారు.
లక్షల కోట్లను అప్పులను తెలంగాణ సర్కార్ తీసుకు వచ్చిందన్నారు. ప్రపంచానికి విశ్వ గురువుగా భారత దేశం ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఓటు బ్యాంకు, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. 2047 నాటికి ఇండియా అభివృద్ది చెందిన దేశంగా మారాలన్నారు. దోపీడి లేని దేశంగా ఇండియా ఎదగాలన్నారు.