తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు భూసేకరణ వ్యయంలో 50% నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు డిపాజిట్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
హైదరాబాద్ నగరానికి తలమానికంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ నిధుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకు ఈ రీజినల్ రింగు రోడ్డును రూ.26 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో దాదాపు 350 కి.మీ.ల పొడవున నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా, భూమి సేకరణ వ్యయంలో మాత్రం 50% ఖర్చును కేంద్ర ప్రభుత్వం, మిగతా 50% ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఒప్పందం మేరకు ఆర్ఆర్ఆర్ భూసేకరణ వ్యయంలో 50% నిధులను వెంటనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతమాల పరియోజనలో భాగంగా హైదరాబాద్ నగరం చుట్టూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే (రీజనల్ రింగు రోడ్డు)ను నిర్మించటానికి మంజూరు చేయడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణను కూడా మొదలు పెట్టడం జరిగిందని, భూసేకరణ కొరకు NH Act 1956, ప్రకారం 3 'A' Gazette Notification కూడా ప్రచురించడమైనదని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన భూసేకరణ వ్యయంలో 50% ఖర్చుకు సంబంధించిన నిధులను డిపాజిట్ చేయమని కోరుతూ జాతీయ రహదారుల శాఖ ప్రాంతీయ కార్యాలయ అధికారి, తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు,భవనాల శాఖ కార్యదర్శి 5 సార్లు లేఖ రాశారని తెలిపారు. ఉత్తర, ప్రత్యుత్తరాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి లేవనెత్తిన సందేహాలను కూడా నివృత్తి చేయడం జరిగిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ భూసేకరణ వ్యయానికి సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ముందుకురాలేదని ఎద్దేవా చేశారు.
2022-23 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రీజనల్ రింగు రోడ్డు భూసేకరణ పేరుతో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వాటిని ఇంతవరకు విడుదల చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయినట్లయితే.. హైదరాబాద్ నగరానికి వచ్చి, వెళ్ళే వాహనాల రద్దీని నియంత్రించవచ్చనీ, అలాగే.. తెలంగాణ ప్రాంత ప్రజలు సామాజికంగా, ఆర్ధికంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తారనీ, మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుందని లేఖలో వివరించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల సౌకర్యం, నూతన టౌన్ షిప్లు, పారిశ్రామిక వాడలు, ఐటీ సంస్థలు, పర్యాటక కేంద్రాలు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, మాల్స్ నిర్మాణం, తదనుగుణంగా పార్కింగ్ సముదాయాల నిర్మాణాల వంటి వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
అలాగే.. ఈ రింగు రోడ్డు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని లేఖలో పేర్కొన్నారు. కనుక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన మేరకు భూసేకరణ వ్యయంలో 50% నిధులను వీలైనంత త్వరగా డిపాజిట్ చేసి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయటానికి సహకరించగలరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.