టెన్త్ పేపర్ లీక్ కేసు .. వాట్సాప్ మెసేజ్‌లకు ఎక్కడైనా నోటీసులిస్తారా : కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

By Siva KodatiFirst Published Apr 6, 2023, 8:56 PM IST
Highlights

వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎక్కడా లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈటల రాజేందర్ మీలాగా దిగజారిన వ్యక్తి కాదని.. 5 గంటలకు నోటీసులు ఇచ్చి 6 గంటలకు విచారణకు రావాలని కోరుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ టెన్త్ పేపర్ లీక్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోటీసులు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ అనే వ్యక్తి పంపిన మెసేజ్‌లలో ఎక్కువ మంది జర్నలిస్టులు వున్నారని అన్నారు. జర్నలిస్టులను భయపెడుతున్నారని.. నోటీసులు ఇస్తారని బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. పోలీసులను పావులుగా వాడుకోవడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని.. బీఆర్ఎస్ రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

తిట్లలో ఎన్ని రకాలు వున్నాయో అవన్నీ ఉపయోగించిన ఏకైక వ్యక్తి కేసీఆరేనని.. జర్నలిస్టుల హక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవినీతి , అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ మీలాగా దిగజారిన వ్యక్తి కాదని.. కల్వకుంట్ల కుటుంబానికి మేమేమైనా బానిసలమా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీపై బీఆర్ఎస్ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. కేసీఆర్‌పై ప్రధాని ఏనాడైనా అనుచిత వ్యాఖ్యలు చేశారా అని కిషన్ రెడ్డి నిలదీశారు. నోటీసుల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 గంటలకు నోటీసులు ఇచ్చి 6 గంటలకు విచారణకు రావాలని కోరుతున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై యువత ఆక్రోశంగా వున్నారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. 

Latest Videos

అంతకుముందు వరంగల్ డీసీపీకి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాశారు. పదో తరగతి పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఆయనకు వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు వరంగల్ డీసీపీ ఎదుట హాజరు కావాల్సిందగా నోటీసులు అందజేశారు. అయితే దీనిపై ఆయన స్పందించారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా తాను రేపు విచారణకు హాజరుకాలేనని తెలిపారు. దీనికి బదులుగా ఈ నెల 10న విచారణకు హాజరవుతానని డీసీపీకి రాసిన లేఖలో ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై డీసీపీ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. 

Also Read: టెన్త్ పేపర్ లీక్ .. ఫోనొస్తే మాట్లాడటమే, నాకు వాట్సాప్ వాడటం రాదు : నోటీసులపై ఈటల స్పందన

ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం  పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను బుధవారం బొమ్మలరామారం  నుంచి వరంగల్‌కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. 

ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను  కలిసేందుకు ఆయన భార్య అపర్ణ.. ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా, అధికారులు అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న బండి సంజయ్‌ను అపర్ణ కలిశారు. సంజయ్‌తో ములాఖత్‌ అనంతరం బయటకు వచ్చిన అపర్ణ మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ అయినప్పటి నుంచి తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి బండి సంజయ్ ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. 

click me!