
న్యూఢిల్లీ:వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.బుధవారం నాడు కేంద్ర మంత్రి Kishan Reddy న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. Paddy ధాన్యం కొనుగోళ్ల విషయమై తొలుత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీంతో Farmers ఇబ్బంది పడ్డారన్నారు. రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడిందని కిషన్ రెడ్డి విమర్శించారు. Boiled Riceను కేంద్రం కొనుగోలు చేయబోదని చెప్పారు. గత సీజన్ లో ఇచ్చిన టార్గెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఆరుసార్లు ఈ విషయమై ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చేందుకు పొడిగింపు ఇచ్చామన్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సీజన్ లో 40.20 లక్షల టన్నుల బియ్యాన్ని ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ ఆధారంగా 40.20 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తాము ఇస్తామన్న 40.20 లక్షల టన్ను ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందో లేదోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాజకీయ స్వార్ధం కోసం ధాన్యం కొనుగోలు విషయమై TRS సర్కార్ వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గోనెసంచులను కొనుగోలు చేయలేదన్నారు. తేమ ను చూసే యంత్రాలు లేవన్నారు. అదే విధంగా తూకం వేసే త్రాసులు కూడా లేవన్నారు. వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా కప్పేందుకు వీలుగా టార్పాలిన్లు లేవన్నారు.
వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ రెండు మాసాలుగా తీవ్రమైన పోరాటం చేసింది. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ విషయమై పలు రకాల ఆందోళనలు చేసింది. ఈ నెల 11న ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు.
ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి వరి ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సాధారణ రకం వరికి క్వింటాల్ కి రూ. 1940 ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1960 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
బాయిల్డ్ రైస్ కాకుండా సాధారణ రైస్ ను తాము తీసుకుంటామని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాయడంతో రైతుల నుండి సేకరించిన దాన్యంలో సాధారణ ధాన్యాన్ని కేంద్రానికి రాష్ట్రం ఇవ్వనుంది.
ఈ రబీ సీజన్ లో సాధారణ బియ్యాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నెల 13న లేఖ రాసింది. ఈ లేఖకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి లేఖ వచ్చింది. సాధారణ బియ్యం సేకరించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సాధారణ బియ్యాన్ని ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో సుమారు 40.20 లక్షల టన్నుల సాధారణ బియ్యం వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు.
ఈ యాసంగి సీజన్ లో 6,968 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.1,77,901 టన్నుల నెలవారీ సామర్ధ్యం ఉన్న 765 రైస్ మిల్లులు, 5,67,265 టన్నుల కెపాసిటీ గల బాయిల్డ్ రైస్ మిల్లులు 2020-21 వరి ధాన్యం మిల్లింగ్ చేస్తున్నాయని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.