
Theft of laptops: రాష్ట్రంలో గత కొంత కాలంగా ఆ ప్రాంతంలో వరుసగా ల్యాప్‌టాప్ లు చోరీకి గురవుతున్నాయి. అది కూడా బ్యాచిలర్స్ రూమ్ ల నుంచే కనిపించకుండా పోతున్నాయి. దీనికి సంబంధించి చాలా కేసులు నమోదయ్యాయి. అయితే, తాజాగా రెండు ల్యాప్ టాప్ లతో అనుమానస్పదంగా ఓ వ్యక్తి కనిపించడంతో విచారించిన పోలీసులకు నిందితుడు దొరికిపోయాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్ గిరి మండలంలో గతేడాది నుంచి ల్యాప్ టాప్ దొంగతనం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు మొత్తం 17 ల్యాప్ టాప్ లు చోరీకి గురయ్యాయి. ఈ దొంగతనాలకు సంబంధించి ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ లో 12 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఘట్‌కేసర్ పరిధిలో నిందితుడు అనుమానస్పదంగా కనిపించాడు. అతని వద్ద రెండు ల్యాప్‌టాప్ లు ఉన్నట్టు గుర్తించారు. అనుమానం కలిగిన పోలీసులు.. నిందితుడిని ప్రశ్నించగా.. చోరీకి పాల్పడిన విషయాలను వెల్లడించారు. ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని దేవసోత్ దిలీప్ రాథోడ్ (Devasoth Dilip Rathod S/o Teekam Rathod) గా పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం ఈ నిందితుడు Devasoth Dilip Rathod S/o Teekam Rathod ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తూ.. మేడ్చల్ జిల్లాలోని నాగారంలోని సత్య నారాయణ కాలనీ నివాసం ఉంటున్నాడు. నిందితుడి స్వస్థలం రెడ్యా నాయక్ తండా, బొల్లపల్లి గ్రామం, యాదాద్రి జిల్లా అని పోలీసులు వెల్లడించారు. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో మొత్తం 17 ల్యాప్‌టాప్ లను దొంగిలించినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడని పోలీసులు పేర్కొన్నారు. మొదట నిందితుల వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ తర్వాత నిందితుల ఇంటి వద్ద నుంచి మరో 15 ల్యాప్‌టాప్ లు.. మొత్తం 17 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాళం వేయని బ్యాచిలర్స్ రూమ్ లను టార్గెట్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ ల వివరాలు..
1. డెల్ కంపెనీ ల్యాప్ టాప్ లు - 04
2. HP – 05
3. లెనోవో - 03
4. ఆసుస్ - 02
5. తోషిబా - 01
6. ఏసర్ - 01
7. ఎమ్ ఎస్ ఐ - 01