బర్త్ సర్టిఫికెట్ ఎవరికి కావాలి..? కేసీఆర్ సీఏఏ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్

By telugu news teamFirst Published Mar 9, 2020, 10:41 AM IST
Highlights

ప్రధాని మోదీ మహిళలను ఎంతగానో గౌరవిస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఐదేళ్ల పాటు ఒక్క మహిళను కూడా మంత్రిని చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల సీఏఏ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బర్త్ సర్టిఫికేట్ ఎవరూ అడగలేదని.. వివరాలు ఉంటే ఇవ్వొచ్చని.. లేకపోతే లేదని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

Also Read ఇంట్లో పుట్టా, నా బర్త్ సర్టిఫికెట్ లేదు, నువ్వెవరంటే..: సీఏఏపై కేసీఆర్...

టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ఇలాంటి వివరాలే అడిగారని.. ఆరోజు కేసీఆర్ వ్యక్తిగత వివరాల గురించి ఎందుకు ఆరాతీయలేదని ప్రశ్నించారు. సమగ్ర సర్వేలో ఎలాంటి వివరాలు అడిగారో.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సర్వేలో కూడా అవే అడుగుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం జనాభా లెక్కల కోసమే ఈ సర్వే చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

మహిళల ఆత్మ గౌరవాన్ని నరంద్రమోదీ ప్రభుత్వం పెంపొందిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. రూ.10కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. డిఫెన్స్, నేవీలలో మహిళలకు ప్రాధాన్యం దక్కిందని వివరించారు. జన్ ధన్ యోజన్ కింద లక్షలాది మంది మహిళలకు కేంద్రం చేయూతను ఇస్తోందని తెలిపారు.

ప్రధాని మోదీ మహిళలను ఎంతగానో గౌరవిస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఐదేళ్ల పాటు ఒక్క మహిళను కూడా మంత్రిని చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

కాగా... ఇటీవల అసెంబ్లీలో సీఏఏ కి వ్యతిరేకంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు బర్త్ సర్టిఫికెట్ లేదని, మీరెవరని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తాను తన ఊళ్లో, తన ఇంట్లో పుట్టానని, ఆస్పత్రి బర్త్ సర్టిఫికెట్ లేదని ఆయన అన్నారు. నీది లేకపోతే నీ తండ్రిదో, తాతదో తేవాలని అడిగితే ఎక్కడి నుంచి తెస్తానని ఆయన అన్నారు. 

తనకే ఈ విధమైన పరిస్థితి ఉంటే దళితులు, పేదలు ఏ విధమైన పరిస్థితిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చునని, తాను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి ఇదే విషయం చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానానికి శనివారం సమాధానం ఇచ్చారు. సీఏఏపై అసెంబ్లీలో రోజంతా చర్చిద్దామని చెప్పారు. తప్పుని తప్పని తాము ధైర్యంగా చెప్తామని కేసీఆర్ అన్నారు. ఈ కామెంట్స్ కే ఇప్పుడు కిషన్ రెడ్డి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. 


 

click me!