జన ఆశీర్వాద యాత్ర: కమలాపూర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By telugu teamFirst Published Aug 20, 2021, 8:42 PM IST
Highlights

కమలాపూర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న జన ఆశీర్వాద యాత్రలో రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్‌కు డబ్బుల రాజకీయాలు కొత్తేమీ కాదని, హుజురాబాద్‌లో చివరిదవుతుందని ఈటల విమర్శించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.

హైదరాబాద్: బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కమలాపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర మాజీ మంత్రి, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. హుజురాబాద్ బైపోల్ నేపథ్యంలో కమలాపూర్‌లో నిర్వహించిన సభలో వీరిరువురూ హాజరవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈటల రాజేందర్ కేసీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

కేసీఆర్‌కు డబ్బుల రాజకీయాలు కొత్తేమీ కాదని, హుజరాబాద్‌లోనూ అదే కొనసాగిస్తున్నారని ఈటల విమర్శించారు. అయితే, కేసీఆర్ డబ్బుల రాజకీయం ఇదే చివరిది అవుతుందని ఎద్దేవా చేశారు. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల ప్రేమను పొందిందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని తెలిపారు. టీఆర్ఎస్ నిజాయితీగా పోటీ చేస్తే చతికిల పడుతుందని అన్నారు. ప్రజాస్వామికంగా బరిలోకి దిగితే ఆ పార్టీకి డిపాజిట్లూ గల్లంతవుతాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారులు చట్టం ప్రకారం పనులు చేయడం లేదని, కేసీఆర్ చుట్టంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ‘కేసీఆర్.. నువ్వు నూటొక్క తప్పులు చేశావు. నీకు శిక్ష తప్పదు’ అని వార్నింగ్ ఇచ్చారు. అన్ని సంక్షేమ పథకాలకు కేసీఆర్ లాక్‌లు వేసుకున్నాడని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలాపూర్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఒకప్పుడు ఏదైనా వైరస్ ప్రబలితే దాని టీకాలు మనకు అందడానికి దీర్ఘకాలం వేచిచూడాల్సి వచ్చేదని, కానీ, ప్రధాని మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పరిస్థితులు మారాయని అన్నారు. ఇందుకు నిదర్శనంగా కరోనావైరస్‌కు భారత్ దీటైన రెండు టీకాలను ఉత్పత్తి చేస్తున్నదని వివరించారు. మోడీ ప్రజల కోసం తపిస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో పడుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నాడని తెలిపారు.

click me!