బీసీల ఆకాంక్షలను అవమానించారు.. రాహుల్ గాంధీపై కిష‌న్ రెడ్డి ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Nov 3, 2023, 5:59 AM IST

Kishan Reddy: తెలంగాణలో బీసీ ముఖ్య‌మంత్రి అంశం వివిధ పార్టీల మ‌ధ్య మాటల యుద్ధానికి తెర‌లేపింది. కాంగ్రెస్-బీజేపీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఇక 'ఐటీ దాడులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అది మా పరిధిలో లేదు. చాలా ఏళ్లుగా ఐటీ వాళ్ల‌ పని వాళ్లు చేసుకుంటున్నారు' అని కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌ను కిష‌న్ రెడ్డి కొట్టిపారేశారు.
 


BJP vs Congress: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాటలు బీసీ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు బీసీ (వెనుకబడిన తరగతుల) నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తామని బీజేపీ హామీ ఇవ్వడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణలో బీజేపీకి రెండు శాతం ఓట్లు మాత్రమే వస్తాయనీ, రెండు శాతం ఓట్లతో బీసీని ముఖ్యమంత్రిని ఎలా చేస్తారని రాహుల్ ప్రశ్నించారు.

ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ అహంకారపూరితంగా, బీసీ వ‌ర్గాల‌ను కించ‌ప‌రిచేలా  మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎక్స్ వేదిక‌గా స్పందించిన ఆయ‌న త‌న పోస్టులో.. "రాహుల్ గాంధీ అహంకారపూరితంగా మాట్లాడారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలను అవమానపరిచేలా వ్యవహరించారు. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న మా పార్టీ నినాదాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం.. బీజేపీని విమర్శించడం మాత్రమే కాదు.. శ్రమపైనే ఆధారపడి జీవించే వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను అవమానించడమేన‌ని" పేర్కొన్నారు.

Latest Videos

undefined

అలాగే, "తెలంగాణ జనాభాలో 55%గా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల ఆశలను, సుదీర్ఘ కాలంగా కలగా మారిన బీసీల రాజ్యాధికార ఆకాంక్షలను.. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను పూర్తిచేసే దిశగా.. బీజేపీ పనిచేస్తోందని" తెలిపారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే సహించలేని రాహుల్ గాంధీ.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తే జీర్ణించుకోలేకపోతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణలోని వెనుకబడిన వర్గాలను ఇలాగే అవమానిస్తూ పోతే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లకు పరిమితం అవడం ఖాయమ‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్, ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠభరితమైన ముక్కోణపు పోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో బీఆర్‌ఎస్ 47.4 శాతం ఓట్లను సాధించి అధికారం ద‌క్కించుకుంది. కాంగ్రెస్ 19 సీట్లుతో 28.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.

click me!