కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్...పీఎస్ కు తరలింపు...

By SumaBala Bukka  |  First Published Jul 20, 2023, 12:09 PM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాటసింగారం డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లే క్రమంలో అడ్డుకుని అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి తో పాటు పలువురు బిజెపి నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘చంపేస్తే.. చంపేయండి..’ అంటూ పోలీసులతో  వాగ్వాదానికి దిగిన కిషన్ రెడ్డి.  కేంద్ర మంత్రితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా..? అంటూ అసహనం వ్యక్తం చేశారాయన.

ఉదయం 9.30గం.లకు ఢిల్లీనుంచి శంషాబాద్ కు చేరుకున్న కిషన్ రెడ్డి.. తన కాన్వాయ్ తో చలో బాటసింగారం అంటూ బయలుదేరారు. ఆయనను శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి కారులోనుంచి దిగి రోడ్డు మీద బైఠాయించారు. నేను ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని.. కచ్చితంగా బాట సింగారం పోతానంటూ కిషన్ రెడ్డి అన్నారు. ఆయనను బలవంతంగా పోలీసులు ఆయన కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

Latest Videos

undefined

పోరుబాటకు వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఈ రోజు ఉదయమే కేంద్రమంత్రి ఢిల్లీనుంచి వచ్చారు. శంషాబాద్ ఓఆర్ఆర్ మీదుగా బాట సింగారంలోని డబులు బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెడుతుండగా.. ఈ పోరుబాటకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు.

ఉదయం నుంచి పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ‘కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోండి.. జైళ్లకు వెళ్లడానికి మేము సిద్ధం’.. అన్నారు. ‘కల్వకుంట్ల ఎమర్జెన్సీలో ఉన్నామా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. 

కిషన్ రెడ్డి తిరిగి వెళ్ల డానికి నిరాకరించడంతో ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నేనేమైనా ఉగ్రవాదినా, ఎక్కడికి వెళ్లడానికైనా నాకు హక్కు ఉంది.. అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

click me!