తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టిక్కెట్లను బీఆర్ఎస్ ఖరారు చేస్తోందనే మాట వినిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య పరస్పర అవగాహన ఉందని ఆరోపించారు. దేశ మహిళలకు కాంగ్రెస్ చాలా కాలంగా తప్పుడు వాగ్దానాలు చేసిందని విమర్శించారు. బీజేపీ వెనుకబడిన వర్గాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఇవ్వనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావని అన్నారు. అనురాగ్ ఠాకూర్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందని, అందులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని.. అలాగే తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనను బ్యాట్స్‌మెన్‌గా బీజేపీ అధిష్టానం ఇక్కడకు పంపించిందని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే దర్యాప్తు సంస్థలు విడిచిపెట్టలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మంచి చేస్తారనుకుంటే.. అది జరగలేదని అన్నారు. నిరుద్యోగులను కూడా కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారని.. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన బిడ్డ పేరు జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని.. అందుకే ఆయన బిడ్డకు ఢిల్లీకి పంపాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవారు ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ప్రతి ఒక్కరి నెంబర్ వస్తుందని.. అప్పుడు వాళ్లు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అని విమర్శించారు.
ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో కాంగ్రెస్ ఎంతో దోచుకుందని ఆరోపించారు. రాజస్తాన్ సచివాలంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులు తెప్పిస్తోందని ఆరోపించారు. హదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ పేరు ప్రస్తావనకు వచ్చిందని.. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోందని చెప్పారు.