అన్నారం, సుందిళ్లకు కూడా సమస్య తలెత్తే ప్రమాదం వుందని.. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల రూపాయలను గంగలో పోశారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లానింగ్‌కు తగ్గట్టుగా డిజైన్ జరగలేదని.. డిజైన్ చేసినట్లుగా నిర్మాణం జరగలేదని భట్టి విమర్శించారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడంతో పాటు అన్నారంలో నీరు లీక్ అవుతూ వుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు . ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరాన్ని ప్రపంచంలోనే అద్భుత కట్టడమని బీఆర్ఎస్ ఊదరగొట్టిందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌పై 15-20 పిల్లర్లు కుంగిపోయాయని.. పోలీసులను పెట్టి ప్రజలకు ఏం జరిగిందో తెలియనీయకుండా చేసే ప్రయత్నం చేశారని విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అని బీఆర్ఎస్ చెప్పుకుందని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ చేసిన డిజైన్ చాలా బాగుండేదని.. కానీ తానే డిజైన్ చేస్తా అంటూ కేసీఆర్ చెప్పారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ మాట్లాడితే రాజకీయం అని విమర్శించారని.. అన్నారం బ్యారేజ్ దగ్గర కాంక్రీట్ నుంచి నీరు లీక్ అవుతోందని ఆయన వెల్లడించారు. డిజైనింగ్ సరిగా లేదని ముందునుంచీ కాంగ్రెస్ చెబుతోందని.. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.లక్షా 21 వేల కోట్లకు పెంచారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు తెలియకుండా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. 20 అంశాలపై డ్యామ్ సేఫ్టీ అధికారులు సమాచారాన్ని కోరారని.. కానీ 20 అంశాలపై కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 అంశాలపైనే సమాచారం ఇచ్చిందని విక్రమార్క విమర్శించారు.
వర్షాకాలానికి ముందు తర్వాతి పరిశీలిన వివరాలను కూడా అధికారులకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి 4 అంశాలపై ప్రభుత్వం విఫలమైందని.. సీమెంట్ కాంక్రీట్ దిమ్మెలను సరిగా పరిశీలించలేదని, మెయింటెనెన్స్ చేపట్టలేదన్నారు. ప్లానింగ్‌కు తగ్గట్టుగా డిజైన్ జరగలేదని.. డిజైన్ చేసినట్లుగా నిర్మాణం జరగలేదని భట్టి విమర్శించారు. మొత్తం బ్లాకులను తీసేసి పునర్నిర్మించాలని.. అది జరిగే వరకు నీటితో నింపకూడదని ఆయన డిమాండ్ చేశారు. అన్నారం, సుందిళ్లకు కూడా సమస్య తలెత్తే ప్రమాదం వుందని.. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల రూపాయలను గంగలో పోశారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము చట్టసభల్లో చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని.. నేనే కట్టిస్తా.. నేనే డిజైన్ చేస్తానంటూ ఈ పరిస్ధితి తీసుకొచ్చారని భట్టి చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు విచారణ జరపకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపోయినట్లుగానే భావించాల్సి వస్తుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. టెండరింగ్ విధానంలో లోపాలున్నాయని ముందే చెప్పామని.. డ్యాం సేఫ్టీ అధికారులు రిపోర్ట్ ఇచ్చినా.. కేంద్రం ఎందుకు స్పందించడం లేదని విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ప్రజల ఆస్తులను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు.
మొత్తం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయి కాబట్టే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. నేనే డిజైన్ చేసా అని కేసీఆర్ అన్నారు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వేరే వారికి కాంట్రాక్ట్ ఇస్తే అందులో వాటాదారులు ఎవరనే విషయమై విచారణ జరపాలని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం జ్ఞానం వున్నా దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.