శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు బీజేపీ కార్యాలయానికి తీసుకు వచ్చారు.
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి అదుపులోకి తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తరలించారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు చలో బాటసింగారం కార్యక్రమానికి గురువారంనాడు బీజేపీ పిలుపునిచ్చింది. అమెరికా పర్యటన నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.
also read:డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రాజకీయ డ్రామాలు: కిషన్ రెడ్డి అరెస్ట్‌పై తలసాని శ్రీనివాస్ యాదవ్
undefined
శంషాబాద్ విమానాశ్రయం నుండి బాటసింగారం వైపునకు వెళ్లే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ కు అడ్డంగా డీసీఎం వ్యాన్ ను అడ్డు పెట్టారు. పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. రోడ్డుపైనే కేంద్ర మంత్రి బైఠాయించారు. పోలీసులు మంత్రిని రోడ్డు పక్కకు వెళ్లాలని కోరారు. ఈ సమయంలో పోలీసులపై మంత్రి మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రిని నేరుగా శంషాబాద్ నుండి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిలిపివేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసులకు, కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీఎం వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కు తరలించారు.