ఈ నెల 16న హైదరాబాద్‌కు అమిత్ షా.. తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొననున్న హోంమంత్రి

By Siva KodatiFirst Published Sep 6, 2022, 5:47 PM IST
Highlights

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గాను కేంద్ర హోంమంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్నారు. 17న పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్నారు కేంద్ర హోంమంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ జిల్లా ముఖ్య నేతలతో అమిత్ షా భేటీకానున్నారు. 

ఇకపోతే.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన 75 ఏళ్లను పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించనున్నట్టుగా చెప్పారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్ అమిత్ షా హాజరుకానున్నట్టుగా చెప్పారు. ఈ వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఆహ్వానాలు పంపినట్టుగా చెప్పారు. 

ALso Read:-సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం.. చీఫ్ గెస్ట్‌గా అమిత్ షా, కేంద్రం అధికారిక ప్రకటన

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందింది.. కానీ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం అప్పుడు స్వాతంత్య్రం రాలేదని కిషన్ రెడ్డి అన్నారు. భారత్‌లో కలిసేందుకు నిజాం నిరాకరించారని ... పాకిస్తాన్‌లో కలిసేందుకు ప్రయత్నాలు చేశాడని అన్నారు. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాలు, కర్ణాటకలో ఉన్న మూడు జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంగా కొనసాగేవని చెప్పారు. ఆనాడు నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థాన ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. 

మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని కోరారు. సెప్టెంబరు 17 అనేది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన రోజుకు గుర్తు అని చెప్పారు. ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించాలని సూచించారు. వలసవాద, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాలను జరుపుకోవడానికి ఇది ఒక సందర్భం అని పేర్కొన్నారు.  

అంతకుముందు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 16, 17, 18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

click me!