కేసీఆర్ ఇక సచివాలయానికి వెళ్లక్కర్లేదు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : అమిత్ షా

By Siva KodatiFirst Published Jul 3, 2022, 6:19 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్ ఇక సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాన్ని సాధించామా అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యిందా అని అమిత్ షా నిలదీశారు. కేసీఆర్.. నా మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకో ... నీది కాదు, నీ కొడుకుది కాదు.. వచ్చేసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

తన కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ పార్టీ గుర్తు అయిన కారు స్టీరింగ్ .. ఓవైసీ చేతుల్లో వుందని ఆయన ఎద్దేవా చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ భారత్ లో భాగం అయ్యేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు అధికారికంగా జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓవైసీకి భయపడే విమోచనం దినాన్ని కేసీఆర్ జరపడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు. 

తాము అధికారంలోకి వస్తే.. ఎవరికీ భయపడకుండా విమోచన దినం జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఇక సచివాలయానికి వెళ్లక్కర్లేదంటూ అమిత్ షా సెటైర్లు వేశారు. వచ్చేసారి సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని ఆయన జోస్యం చెప్పారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమిస్తోందని అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అమిత్ షా కోరారు. 

తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం : యోగి ఆదిత్యనాథ్

తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఉత్సాహం మాకు స్పూర్తిని ఇష్తోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  జరుగుతున్న విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటో చూపించారని అన్నారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని.. రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందడం లేదని యోగి మండిపడ్డారు. యూపీలో 15 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని ఆయన గుర్తుచేశారు. 

రెండ్రోజులుగా హైదరాబాద్ లో అనేక అంశాలపై మథనం చేశామని.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ భావనతో ముందుకు వెళ్తున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో యూపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు కావడం లేదని.. కేంద్ర పథకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్టాంప్ వేసుకుంటోందని ఆదిత్య నాథ్ ఆరోపించారు. త్వరలోనే తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అవినీతి, మాఫియాపై యూపీలో ఉక్కుపాదం మోపామని ఆయన స్పష్టం చేశారు. 

click me!