
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రమంత్రి హరీష్ రావు ఓ ఘాటు లేఖ రాశారు. ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని ఫైర్ అయ్యారు. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఉపాధి దెబ్బతీసిన కేంద్రం ఇప్పుడు ఏకంగా ఉపాధి హామీ పథకానికే ఎసరు పెట్టిందని ఆగ్రహించారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యూలర్ (1).F.No.J-11060/2/2021-RE-Vl(374151), Dt.30.12.2021 and Dt.05.05.2022, మరియు(2).F.NoJ.11017/39/2017-RE-VII(E378816), Dt. 18.07.2022 ఉన్నదని, ఇది ప్రజల నోట్లో మట్టిగొట్టడమేనని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లోని కూలీలతోపాటు తెలంగాణలో 57.46 లక్షల జాబ్ కార్డులు కలిగిన 1,21,33,000 మంది ఉపాధి కూలీల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఆదాయం, ఆహారభద్రత ఈ పథకాన్ని రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పాల్పడటం దారుణం అని ఆగ్రహించారు.
కూలీలు చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోవడం, కొత్త బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలని కోరడం, రోజు ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటలకు ఫొటోలు పెట్టాలని, పర్యవేక్షించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతినిధులను ఏర్పాటు చేయాలని సూచించడం వంటివన్నీ ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే తీసుకున్న నిర్ణయాలు అని స్పష్టం అవుతున్నదని వివరించారు.
ఉపాధి కూలీల వేతనాలు దేశవ్యాప్తంగా పది వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పార్లమెంటులో స్వయంగా కేంద్రమంత్రి చెప్పారని, తెలంగాణలోని ఉపాధి కూలీలకు చెందాల్సిన 83 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఉపాధి పని ఎక్కువగా ఎండకాలంలో జరుగుతుందని పేర్కొన్న మంత్రి హరీశ్ రావు.. కూలీలు ఉదయం 10 గంటలలోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఫొటోలు దిగి అప్‌లోడ్ చేయాలని సర్క్యూలర్ జారీ చేయడాన్ని తప్పుపట్టారు. ఎండాకాలంలో 8 గంటలు పని చేయడం సాధ్యమా? అంతా చేసినా గరిష్ట కూలీ రూ. 257 ఇస్తారా? అని ప్రశ్నించారు. రూ. 257తో కూలీలకు నిజంగా జీవనోపాధి లభిస్తుందా? అని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పని దినాలనూ 300ల రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కూలీలకు బీమా సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు.
అదీగాక, కొత్తగా బ్యాంకు అకౌంట్లు తీయాలని కూలీలను వేధించడం దారుణం అని పేర్కొన్నారు. ఈ సూచనతో వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని ఆరోపించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు అంటే.. సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా ఓడిన వారికి ఈ పథకాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించడం మరీ దారుణం అని పేర్కొన్నారు. ఇది కేవలం వారి రాజకీయ లబ్ది కోసమేనని, తద్వార ఓడిన తమ అభ్యర్థులకు ఈ అధికారాన్ని కట్టబెట్టవచ్చని కేంద్రం భావిస్తున్నదని తెలిపారు.