
బ్యాంకులో పని భారం భరించలేక ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డారు. అస్వస్థతకు గురికావడంతో ఇతర సిబ్బంది ఆయనను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ ఘటన ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ లో బానోతు సురేష్ (35) తన భార్య ప్రియాంక, కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన వాంకిడి మండలంలోని ఎస్‌బీఐ బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు పని భారం పెరిగింది. ఈ విషయాన్ని పలుమార్లు భార్యతో వెల్లడించారు. ఇద్దరు చేయాల్సిన పనిని తాను ఒక్కడిని చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. ఎప్పటిలాగే ఈ నెల 17వ తేదీన కూడా బ్యాంకుకు వెళ్లారు. అంతకు ముందే తన వెంట పురుగుల మందు తీసుకెళ్లారు. విధులు పూర్తయిన తరువాత తన ఆఫీసులోనే 7.30 గంటల ప్రాంతంలో ఎవరికి తెలియకుండా పురుగుల మందు తాగారు. కొంత సమయం తరువాత అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీనిని ఇతర సిబ్బంది గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించారు. దీంతో తనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన సమాధానం ఇచ్చాడు.
దీంతో సిబ్బంది హుటాహుటిన సురేష్ ను ఆసిఫాబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ లో డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన చికత్స కోసం మంచిర్యాలలోని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను కరీంనగర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సురేష్ ను జాయిన్ చేశారు.
కాగా.. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం చనిపోయారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు వాంకిడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.