తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో 90 మంది అభ్యర్థులకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న విడుదల చేయనున్నారు కేసీఆర్.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు అసెంబ్లీకి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. తొలి విడతలో 90 మంది అభ్యర్థులకు చోటు దక్కే అవకాశం ఉంది. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న విడుదల చేయనున్నారు కేసీఆర్.
ఇవాళ విడుదల చేయనున్న జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 11 మందికి అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. సర్వే ఫలితాలు, సామాజిక సమీకరణాలు ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
2018లో ఒకేసారి 105 మందితో అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. అయితే ఈ దఫా 90 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటలలోపు అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు.
అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం కేసీఆర్ కసరత్తు చేశారు. ఈ దఫాల ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని అభ్యర్థులను పిలిపించి మాట్లాడారు. ఇదిలా ఉంటే తమకే టిక్కెట్లు ఇవ్వాలని కోరుతూ ఆశావాహులు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు , కవిత ఇళ్లకు క్యూ కట్టారు.
ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది.మంత్రివర్గంలో ఉన్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ మినహా మిగిలిన వారికి జాబితాలో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్ జాబితాలో టిక్కెట్లు దక్కవని భావించిన కొందరు నేతలు ఆయా నియోజకవర్గాల్లో నిరసనలకు దిగుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వవద్దని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీట్లను దక్కించుకోవడం కోసం చివరి నిమిషం వరకు నేతలు ప్రయత్నిస్తున్నారు.