తాహతుకు మించి అప్పులు.. ఒత్తిడి తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య...

By Bukka SumabalaFirst Published Sep 16, 2022, 7:25 AM IST
Highlights

అప్పుల బాధ భరించలేక.. తీర్చే దారీ, తెన్నూ కానరాక ఓ కుటుంబం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా 23రోజుల వ్యవధిలో ఈ నలుగురూ చనిపోయారు. 

జగిత్యాల : వారిద్దరు.. వారికిద్దరూ.. నలుగురు సభ్యుల కుటుంబం.. చక్కగా చదువుకుంటున్న పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న సంసారం.. ఆర్థిక అవసరాలు ఆ కాపురంలో చిచ్చుపెట్టాయి. సంసారం నడవడానికి, పిల్లల చదువులకోసం ఆ ఇంటి యజమాని అప్పుల వైపు నడిచాడు. అంత అవసరం పడితే అయినవారు ఆదుకోకపోతారా అనుకున్నాడు. అప్పులు ఎలాగైనా తీర్చేద్దామనుకున్నాడు. అతనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది.. అనుకోకుండా ఆయన తండ్రి మరణించాడు. ఇది వారిని విషాదంలోకి నెట్టింది. దీనికి తోడు వ్యాపారం సరిగా సాగలేదు. ఆదుకునేందుకు బంధువులు, స్నేహితులు ఎవరు ముందుకు రాలేదు. 

అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువయ్యాయి. అవి తాళలేక... నలుగురిలో నవ్వుల పాలు కావడం ఇష్టం లేక.. వారు మరణమే శరణం అని భావించారు. తానొక్కడే చనిపోతే కుటుంబం మీద భారం పడుతుందనుకున్నాడేమో.. భార్యభర్తలిద్దరూ చనిపోయినా చిన్నారులు బతకడం కష్టంగా మారుతుందనుకున్నాడేమో.. అంతే చావులోనూ నలుగురూ ఉండాలనుకున్నాడు. అందుకోసం పురుగుల మందు తాగారు. దీంతో 23 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తీవ్ర విషాదం నింపింది.

హైద్రాబాద్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కు చెందిన ఆకోజి కృష్ణమూర్తి (42)కి బంగారం, వెండి ఆభరణాల తయారీ దుకాణం ఉంది. భార్య శైలజ (32) గృహిణి. కుమారుడు  ఆశిక్ ఆశ్రిత్ (15) పదో తరగతి, కుమార్తె గాయత్రి (14) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వ్యాపారం సరిగా సాగకపోవడంతో పిల్లల చదువు, కుటుంబ నిర్వహణ కోసం కృష్ణమూర్తి సుమారు రూ.30 లక్షల వరకు అప్పులు చేశారు. ఏడాదిన్నర కిందట ఆయన తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు.  అప్పటి నుంచి పని సరిగా లేకపోవడం, అప్పులు ఇచ్చిన వారు తీర్చాలంటూ ఒత్తిడి చేస్తూ ఉండడం, బంధువులు పట్టించుకోక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

గత నెల 21న నలుగురూ ఇంట్లో పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని మొదట జిల్లాకేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు.  పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 24న కృష్ణమూర్తి మృతి చెందాడు. ఈ నెల 5న  గాయత్రి, బుధవారం ఆశ్రిత్  కన్నుమూశారు. ఇరవై మూడు రోజులు ప్రాణాలతో పోరాడిన శైలజ గురువారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

click me!