
తెలంగాణ కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు. అయితే ఆదే సమయంలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. లాకప్‌లో వున్న తన అంబేద్కర్‌ను విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారని వీహెచ్ అన్నారు. 2019 ఏప్రిల్ 12న వీ హనుమంతరావు హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించగా.. ఆ తర్వాతి రోజే దానిని ఎవరో కూల్చేశారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో వీహెచ్ మరో విగ్రహాన్ని చేయించారు. అయితే దానిని పోలీసులు సీజ్ చేశారు. దీనిపై వీ హనుమంతరావు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు కూడా లేఖలు రాశారు.
Also REad:కేసీఆర్ చేసి చూపారు.. మీరూ ఆచరించండి : ‘‘అంబేద్కర్’’ విషయంగా బీజేపీకి తలసాని చురకలు
అంతకుముందు నూతనంగా నిర్మిస్తోన్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు కేసీఆర్. అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పాటైందని సీఎం కొనియాడారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికే ఆదర్శమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని.. త్వరలోనే దీనికి సంబంధించి ప్రధానికి లేఖ రాస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.