
సిద్దిపేట: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్య (farmers suicide)లు కొనసాగుతున్నాయి. పంటలు పండక కొందరు, పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఆర్థిక కష్టాలతో మరికొందరు, అప్పుల బాధతో మరికొందరు... ఇలా కారణమేదైనా రైతుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. తాజాగా సిద్దిపేట జిల్లా (siddipet district)లో ఒకరు, ములుగు జిల్లా (mulugu district)లో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం శంకరాయకుంట గ్రామానికి చెందిన ఎర్వ రామస్వామి(55) సన్నకారు రైతు. తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇటీవల పంటలు సరిగ్గా పండకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగింది. ఇలా రూ.4లక్షల వరకు అప్పు కావడంతో తీవ్ర ఒత్తిడికి గురయిన రామస్వామి దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
గత శుక్రవారం పొలానికి కొట్టడానికి తీసుకువచ్చిన పురుగుల మందు తాగాడు రామస్వామి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన రామస్వామిని కుటుంబసభ్యులు సిద్దిపేట హాస్పిటల్ కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం రామస్వామి మృతిచెందాడు.
రామస్వామి మృతితో కుటుంబపెద్దను కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక తోటి రైతు అప్పులబాధతో మృతిచెందడం మిగతా అన్నదాతలకూ కన్నీరు తెప్పిస్తోంది. దీంతో శంకరాయకుంటలో విషాదం నెలకొంది.
ఇక ఇలాగే అప్పులబాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదం ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఏటురునాగారంకు చెందిన పోతురాజు(42) ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని మిర్చి పంట వేసాడు. అయితే ఇటీవల తెగుళ్లు సోకడంతో మిర్చిపంట దెబ్బతింది. దీంతో పోతురాజు తీవ్రంగా నష్టపోయాడు.
అయితే కౌలు డబ్బులు మీదపడటమే కాదు పెట్టుబడి కోసం వడ్డీకి తెచ్చిన ఐదులక్షలు నెలనెలకూ పెరిగిపోతుండంతో పోతురాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదిలావుంటే ఇటీవల ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా (nalgonda district)కు చెందిన ఓ రైతు ఏకంగా మంత్రి కేటీఆర్ (KTR) కే ఇటీవల లేఖ రాసాడు. కనగల్ మండలంలో ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను వ్యవసాయ భూమిని కోల్పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్‌లకు లేఖ రాశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.
తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని శ్రీను లేఖలో పేర్కొన్నాడు. అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని... కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి (limineti madhav reddy) ప్రాజెక్టు కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేదని... దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు.
వ్యవసాయ భూమి కోల్పోవడంతో తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉంది... కాబట్టి చనిపోయేందుకు అనుమతించాలని శ్రీను కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు, కనగల్ తహసీల్దార్‌కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని... అందుకే మంత్రి కేటీఆర్ కు లేఖ రాయాల్సి వచ్చిందన్నారు.