రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. జలమండలి అధికారుల తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి మొఘల్స్ కాలనీలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కలుషిత నీరు తాగి మృతి చెందినవారిలో ఆఫ్రిన్ సుల్తానా, మహ్మద్ ఖైసర్ లుగా గుర్తించారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు విమర్శిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
హైద్రాబాద్ నగరంలో కలుషిత నీరు తాగి మరణించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. మాదాపూర్ సమీపంలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి ఒకరు మరణించడంతో పాటు 60 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన జరిగింది.వడ్డెర బస్తీలో కూడా మంచినీరు కలుషితమౌతుందని స్థానికులు జలమండలి అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అయితే ఈ బస్తీకి చెందిన ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లడంతో జలమండలి అధికారులు స్పందించారు. మంచినీటి శాంపిల్స్ ను పరిశీలించారు. మురుగు నీరు మంచినీళ్లతో కలిసి కలుషితంగా మారిందని వడ్డెర బస్తీవాసులు అప్పట్లో ఆరోపించారు. చివరకు మంచినీరు కలుషితం కాకుండా పైప్ లైన్ ను మార్చారు అధికారులు.2009 మే మాసంలో ముషీరాబాద్ భోలక్ పూర్ లో 14 మంది మృతి చెందారు.నీరు కలుషిత నీరు తాగడం వల్ల ఈ మరణాలు సంబవించినట్టుగా గుర్తించారు.