
హైదరాబాద్ నార్సింగిలో మహిళ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మహిళ కిడ్నాపైన పీరం చెరువు నుంచి ఘటన జరిగిన కిస్మత్‌పూర్ చెరువు దాకా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. బాధితురాలు స్పృహ కోల్పోయాక.. వివాహితపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్‌రేప్ తర్వాత మహిళను చాలాసేపు కారులోనే తిప్పిన కీచకులు.. రాత్రి సయంలో గండిపేట వద్ద వదిలి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: రంగారెడ్డి జిల్లాలో దారుణం: కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్
దోపిడి దొంగల ముఠా రెండు రోజుల పాటు మహిళను ఫాలో అయినట్లు స్థానికులు గుర్తించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో కారులో ఇద్దరు వున్నారని.. ఆమె గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించినట్లుగా చెబుతున్నారు. అనంతరం ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును కూడా దొంగిలించారని, బాధితురాలు పనిచేసే ఇంటి యజమాని చెబుతున్నారు. తనను కొందరు ఫాలో అవుతున్నారని.. బాధితురాలు సన్నిహితుల వద్ద ముందే ప్రస్తావించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి బాచుపల్లికి చెందిన శుభం శర్మ, సుమిత్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.