
Telangana Finance Minister T Harish Rao: చేగుంట, రామాయంపేట మండలాల సాగునీటి అవసరాల కోసం కొండ పోచమ్మ సాగర్ నుంచి ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్ ఐఎస్ )తో ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టించాయన్నారు. అలాంటి అడ్డంకులన్నిటినీ ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో అధిగమించి గోదావరి జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించాలన్న కలను సాకారం చేశారనీ, 400 నుంచి 500 మీటర్ల లోతులో బోర్లు తవ్వినా ఈ ప్రాంతానికి నీరు రావడం కష్టమైన పనేనని అన్నారు.
కొండ పోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే ఏడాది పొడవునా సాగునీరు అందుతుందని తెలిపిన మంత్రి హరీశ్ రావు.. వెనుకబడిన రామాయంపేట, దుబ్బాక ప్రాంతాల్లో తాగునీరు కూడా అందించడం చిరకాల స్వప్నమని అన్నారు. అయితే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతృత్వంలోని గత ప్రభుత్వాలు ఏనాడూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. చేగుంట ప్రాంతం సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి సముద్ర మట్టానికి 612 మీటర్ల ఎత్తులో కొండ పోచమ్మ సాగర్ నిర్మాణంలో ముందుకుసాగారని తెలిపారు.
అలాగే, రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పునరుద్ఘాటించిన హరీశ్ రావు.. బోరుబావుల వద్ద విద్యుత్ మీటర్లు బిగించాలని కేంద్రం రాష్ట్రాన్ని ఒత్తిడి చేసిందని ఆరోపించారు. అందుకు ముఖ్యమంత్రి నిరాకరించడంతో కేంద్రం రూ.30 వేల కోట్ల బకాయిలను వెనక్కి తీసుకుందని అన్నారు. కాగా, కొండ పోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏడుపాయల దేవాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లో పెనుమార్పులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో ఏడుపాయల దేవాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. శనివారం మెదక్ లోని శ్రీ వన దుర్గా భవాని ఆలయ మూలవిరాట్టుకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.1,000 కోట్లు వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.600 కోట్లు ప్రకటించారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమనీ, ప్రతి బడ్జెట్ లో దేవాలయాల అభివృద్ధికి తగినన్ని కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు.
యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభివృద్ధి చేశారనీ, ఏడుపాయల దేవస్థానానికి ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేస్తోందని హరీశ్ రావు తెలిపారు.