టీవీ9 లోగోనూ అమ్మేశాడు: రవిప్రకాష్ పై మరో కేసు నమోదు

By telugu teamFirst Published May 17, 2019, 7:01 AM IST
Highlights

ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై కంపెనీ ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు నమోదైంది.

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ మీద మరో కేసు నమోదైంది. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై కంపెనీ ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు నమోదైంది. కౌశిక్‌రావు హైదరాబాదు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం...  రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేశారు. 

2018 మే 22న కుదిరిన మౌఖిక ఒప్పందం మేరకు వీటిని అమ్ముతున్నామంటూ 2018 డిసెంబరు 31న డీడ్‌ ద్వారా వాటిని రాసిచ్చేశారు. లోగోలు అమ్మినందుకు టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీపీఎల్‌కు డబ్బులు అందాలి. అందుకు సాక్ష్యంగా 2019 జనవరి 22న 99,000 రూపాయలను నెక్ట్స్‌ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారు. నిధుల బదిలీకి కారణాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అదర్‌ రిపెయిర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌గా పేర్కొన్నారు. 

అదే విషయాన్ని 2019 ఫిబ్రవరి 28న కంపెనీ బుక్స్‌లో అదే కారణంతో నమోదు చేశారు. కోట్ల రూపాయల విలువచేసే లోగోలను అక్రమంగా, దురుద్దేశపూర్వకంగా, కంపెనీవాటాదారులకు నష్టం కలిగించే విధంగా రవిప్రకాశ్‌ బదిలీ చేశారని కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నపుడు మెజారిటీ వాటాదారులకు సమాచారం ఇవ్వాలనే నిబంధనను పాటించలేదని ప్రస్తావించారు.

click me!