ఈ నెల 17న హైద్రాబాద్ లో జరిగే సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
హైదరాబాద్: ఈ నెల 17న హైద్రాబాద్ లో జరిగే సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు.ఈ ఏడాది ఆగస్టు 21న కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు దక్కలేదు. పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులుతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ఉండాలని తన అనుచరులకు తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతానని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు తేల్చి చెప్పారు.ఈ మేరకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు.తన అనుచరులతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశంలో క్షేత్రస్థాయికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కూడ పాల్గొంటున్నారు. ఈ నెల 6 లేదా 10 తేదీల్లో కాంగ్రెస్ లో చేరాలని తుమ్మల నాగేశ్వరరావు తొలుత భావించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే యూరప్ పర్యటనలో ఉన్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో హైద్రాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ నెల 17న హైద్రాబాద్ లో భారీ సభను తుక్కుగూడలో నిర్వహించనున్నారు.ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే హామీలను ఆ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.ఈ సభలోనే తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
also read:ధరఖాస్తు చేసుకోకున్నా అలాంటి వారికి టిక్కెట్లు: ఆ 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది. నిన్న మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడినా తాము పార్టీలోనే కొనసాగుతామని మల్కాజిగిరి నేతలు తేల్చి చెప్పారు.
మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మెదక్ అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు కోరుతున్నారు. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా అభ్యంతరం లేదని చెబుతున్నారు.మరో వైపు మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా తమకు ఇబ్బంది లేదని మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్ద ప్రతిపాదించినట్టుగా సమాచారం. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టు మైనంపల్లి హన్మంతరావుకు దక్కింది. అయితే రెండు సీట్లు కావాలని మైనంపల్లి హన్మంతరావు కోరుతున్నారు మెదక్ అసెంబ్లీ స్థానం కోసం పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడాలని భావిస్తున్నారని సమాచారం. ఈ లోపుగా టిక్కెట్ల విషయమై కాంగ్రెస్ నాయకత్వం నుండి హామీని మైనంపల్లి హన్మంతరావు కోరుతున్నారు.
మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు మాత్రమే జనరల్ అసెంబ్లీ సీట్లున్నాయి. పాలేరు,కొత్తగూడెం, ఖమ్మం. పాలేరు సీటును తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం చేస్తే పాలేరు నుండి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు. అనివార్య పరిస్థితులు ఎదురైతే పాలేరును వదిలి ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. లేకపోతే పాలేరు నుండి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.