టీటీడీపీ మేనిఫెస్టో: అమరవీరుల కుటుంబాలకు పెద్దపీట

By narsimha lodeFirst Published Sep 27, 2018, 2:52 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు రూ.10లక్షలతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఉద్యోగం  కల్పిస్తామని టీడీపీ తెలంగాణ నేతలు  ప్రతిపాదిస్తున్నారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు రూ.10లక్షలతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఉద్యోగం  కల్పిస్తామని టీడీపీ తెలంగాణ నేతలు  ప్రతిపాదిస్తున్నారు.ఈ మేరకు మేనిఫెస్టో‌కు రూపకల్పన చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన మేనిఫెస్టోను టీటీడీపీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో కమిటీ గురువారం నాడు  ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సమావేశమైంది. ఇప్పటికే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై  పలు ప్రతిపాదనలపై నేతలు చర్చించారు.  దేవేందర్ గౌడ్ నేతృత్వంలో ఈ కమిటీ సభ్యులు  పలు అంశాలపై చర్చించారు. మేనిఫెస్టోలో కనీసం 20 అంశాలను  చేర్చాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్లక్ష్యానికి గురైన అమరవీరుల కుటుంబాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి అమరుల కుటుంబాలను ఆదుకోవాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు.ఈ మేరకు మేనిఫెస్టోలో పలు అంశాలను చేర్చాలని  భావిస్తున్నారు. 

పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరుతోంది.  ఈ మేరకు ఈ అంశాన్ని కూడ మేనిఫెస్టోలో చేర్చనున్నారు స్థానిక సంస్థల బలోపేతం చేయడం.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ తదితర అంశాలను కూడ మేనిఫెస్టోలో చేర్చనున్నారు.

మరోవైపు  అన్న క్యాంటీన్ల మాదిరిగానే తెలంగాణలో ప్రోఫెసర్ జయశంకర్ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఈ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై రాష్ట్రకమిటీ ఆమోదం పొందాలని మేనిఫెస్టో కమిటీ భావిస్తోంది.

అక్టోబర్ 2వ తేదీన మరోసారి మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. అక్టోబర్ 10వ తేదీన మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచాలని  టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయమై చంద్రబాబునాయుడు ముందు కూడ  మేనిఫెస్టో అంశాలను వివరించి ఆమోదం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

click me!