ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే.. ధర్మపురికి హుజురాబాద్ తరహాలో ఒకేసారి దళితబంధు : కేసీఆర్

By Siva Kodati  |  First Published Nov 2, 2023, 6:00 PM IST

ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ రోజు 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా వున్నామని.. తాగునీటి సరఫరా, కరెంట్, విద్యుత్‌లలో అగ్రస్థానంలో వున్నామని సీఎం వెల్లడించారు.


ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ధర్మపురిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కోసం, ప్రజల బాగుకోసం బీఆర్ఎస్ పుట్టిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు గెలవనంత వరకు దేశం బాగుపడదని సీఎం వ్యాఖ్యానించారు. 

ధరణి పోర్టల్ వుండటం వల్ల రైతుల మధ్య భూమికి సంబంధించిన గొడవలు లేవన్నారు. ఓటు వేసేటప్పుడు అభ్యర్ధితో పాటు వారి పార్టీ చరిత్రను కూడా ఓటర్లు గమనించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 70 నుంచి 80 వేల ఓటర్ల మెజారిటీతో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి హుజురాబాద్ మాదిరిగా ఒకేసారి దళితబంధు పథకం మంజూరు చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. సమాజం బాగుపడాలని స్వయంగా ఆలోచించి తీసుకొచ్చిన పథకమే దళితబంధు అని అన్నారు. 

Latest Videos

Also Read: రైతుబంధు, దళితబంధు పదాలు పుట్టించిందే నేను .. ఎలక్షన్ల కోసం ఈ పథకాలు పెట్టలేదు : కేసీఆర్

భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి,  ప్రధానమంత్రి కూడా దళితబంధు గురించి ఆలోచన చేయలేదన్నారు. సంపదను పెంచుతున్నాం.. పేదలకు పంచుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజు 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా వున్నామని.. తాగునీటి సరఫరా, కరెంట్, విద్యుత్‌లలో అగ్రస్థానంలో వున్నామని సీఎం వెల్లడించారు.

పదేళ్ల చిన్న వయసే వున్నా.. అనేక రంగాల్లో మంచి మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసి ముందుకు పోతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశామని.. ప్రస్తుతం పనులు జరుగుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు. 

click me!