
తెలంగాణ: TSRTCని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలుపలేదు. గవర్నర్ ఆమోదం తెలిపితే.. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. కానీ, బిల్లును పంపి రెండు రోజులైనా ఇంకా ఆమోదం తెలుపకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రేపు బస్సు బంద్‌కు పిలుపు ఇచ్చారు. నేడు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అంటే రెండు గంటలపాటు తెలంగాణ వ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు తీయవద్దని నిర్ణయించారు. ఈ రెండు గంటలపాటు బంద్ పాటించనున్నారు. అంతేకాదు, ఉదయం 11 గంటలకు పీవీ మార్గ్ నుంచి రాజ్‌భవన్ వద్దకు వెళ్లి ఆర్టీసీ కార్మికులు ముట్టడి చేస్తామని కార్మికులు తెలిపారు. ఆర్టీసీ విలీన బిల్లుపై తాత్సారం వహించడాన్ని నిరసిస్తూ రేపు రాజ్‌భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చారు.
డిపోల నుంచి బస్సులు బయటికి తీయవద్దని డిపో మేనేజర్లకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి.
కేసీఆర్ ఆధ్వర్యంలో ఇటీవలే భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ గుడ్ న్యూస్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఆర్థికపరమైనది. కాబట్టి, ఈ బిల్లుకు ఆమోదం కోసం ప్రభుత్వం రెండు రోజుల క్రితం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్దకు పంపింది. కానీ, ఆమె ఈ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే.. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Also Read: తెలంగాణ ఆర్టీసీ బిల్లు: తమిళిసై నుండి రాని ఆమోదం, కేసీఆర్ సర్కార్ తర్జనభర్జన
తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలోని 43,373 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ఆర్టీసీ విలీనం నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని, కానీ, గవర్నర్ మాత్రం అంధకారం నింపే ప్రయత్ంన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని, లేదంటే.. నల్లబ్యాడీలతో ఆర్టీసీ కార్మికులంతా నిరసనలు చేస్తారని, అవసరమైతే రాజ్‌భవన్ ముట్టడిస్తామనీ హెచ్చరించారు.