తెలంగాణ అసెంబ్లీలో వర్షాలు, వరదలపై చర్చ సమయంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉచిత విద్యుత్, ధరణి అంశంపై కాంగ్రెస్ చేసిన ప్రకటనలను మంత్రులు ప్రస్తావించి ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ సభ్యులు కూడ ఈ విషయమై ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలపై తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారంనాడు చర్చ జరిగింది.ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో సుమారు 15 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టపోయిన విషయాన్ని మీడియా రిపోర్టు చేసిందని శ్రీధర్ బాబు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని మీడియాలో చూసినట్టుగా శ్రీధర్ బాబు తెలిపారు.
undefined
చాలా పంట పొలాల్లో ఇసుక మేట వేసిన విషయాన్ని మాజీ మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. వరద నష్టంపై శ్రీధర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. మాజీ మంత్రి శ్రీధర్ వాస్తవాలు మాట్లాడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగిందో ఊహించుకొని మాట్లాడడం సరైంది కాదన్నారు.వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని కేటీఆర్ కోరారు.
రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల పంట నష్టమైందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిందా అని ఆయన ప్రశ్నించారు. పంట రుణమాఫీని పూర్తిగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్యూజులు ఎగిరిపోయాయన్నారు. దీంతో ప్రభుత్వంపై ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తున్నారన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ సరిపోతుందని చెబుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మేరకు అమెరికాలో ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎవరు రైతుల పక్షపాతి, ఏ పార్టీ రైతులకు ద్రోహం చేసిందో ప్రజలకు తెలుసునని కేటీఆర్ చెప్పారు.
మంత్రి కేటీఆర్ లేవనెత్తిన అభ్యంతరంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. తాను మాట్లాడే సమయంలో పూర్తిగా వినకుండానే మంత్రి కేటీఆర్ స్పందించారన్నారు. వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం గురించి మీడియాలో వచ్చిన విషయాన్ని తాను ప్రస్తావించినట్టుగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చెప్పారు. అయితే తన రక్షణగా రావాలని శ్రీధర్ బాబు స్పీకర్ ను కోరారు. తన నియోజకవర్గంలో పంట నష్టం గురించి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. రాష్ట్రంలో పంట నష్టం గురించి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు.ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అధికారిక లెక్కలని చెబుతూ సభను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. తనను మాట్లాడకుండా మంత్రులు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చెప్పారు. తనకు అండగా నిలవాలని స్పీకర్ ను శ్రీధర్ బాబు కోరారు.
ఇదే సమయంలో మరోసారి కేటీఆర్ స్పందించారు. రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను మరోసారి కేటీఆర్ ప్రస్తావించారు. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తాం, దళారీ వ్యవస్థను తీసుకు వస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుందన్నారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించాలని శ్రీధర్ బాబును కోరారు మంత్రి కేటీఆర్.
ఉచిత విద్యుత్ పై స్పీకర్ చర్చ పెడితే తాము ఆ అంశంపై తప్పకుండా సమాధానం చెబుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చెప్పారు. ప్రస్తుతం వర్షాలు, వరదలపై చర్చ జరుగుతున్నందున తాను అదే అంశానికి పరిమితం అవుతానన్నారు.
భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం నుండి సమాధానం లేకపోవడంతో విద్యుత్ అంశాన్ని తీసుకు వస్తున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయమై గతంలో ఏం చేశామో, రానున్న రోజుల్లో ఏం చేయనున్నామో తాము ప్రకటిస్తామన్నారు. భారీ వర్షాలపై వాస్తవాలు చెప్పాలని అధికార పక్షం కోరుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబకు సూచించారు.
also read:కోకాపేటలో భూములకు రికార్డు ధర చూసైనా కళ్లు తెరవాలి: విపక్షాలపై కేటీఆర్ సెటైర్లు
ఈ సమయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు పర్యటించిన విషయాన్ని మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసి మాట్లాడుతున్నారన్నారు. తమ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును మాట్లాడనీయకుండా మంత్రులు అడ్డుపడడాన్ని తప్పుబట్టారు. వర్షాలు, వరదలపై మాట్లాడకుండా రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ను మూడు గంటలే ఇవ్వాలని ఎవరూ చెప్పలేదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ఇచ్చిన చరిత్ర తమ పార్టీదని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమయంలో మరోసారి శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేశారన్నారు. స్పీకర్ అనుమతిస్తే ఈ వీడియోను ప్రదర్శిస్తామని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
ఈ సమయంలో శ్రీధర్ బాబును మాట్లాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ సమయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడాలని ప్రయత్నించారు.అయితే వరదలపై శ్రీధర్ బాబుకు అవకాశం ఇచ్చినందున ఆయనను మాట్లాడనివ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కోరారు.
ఈ సమయంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ గతంలో కూడ ప్రకటించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చెప్పారు. ఆయా జిల్లాల్లో పంట నష్టంపై మీడియాలో వచ్చిన లెక్కలను శ్రీధర్ బాబు ప్రస్తావించారు. అయితే ఈ సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి శ్రీధర్ బాబు ప్రసంగానికి అడ్డుపడ్డారు. పంట నష్టంపై అధికారంగా సర్వే పూర్తి కాకుండానే మళ్లీ శ్రీధర్ బాబు పంట నష్టంపై లెక్కలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
మూడు గంటలకు విద్యుత్ సరిపోతుందని చెప్పిన నేతలకు రైతులపై అంత ప్రేమ ఎలా వచ్చిందని శ్రీధర్ బాబుకు కౌంటరిచ్చారు. అయితే వరద నష్టంపై లెక్కలు చెప్పొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ బాబుకు సూచించారు. తాను మీడియా రిపోర్టు ఆధారంగా చెబుతున్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వివరించారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం శాస్త్రీయ బద్దంగా లేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తన నియోజకవర్గానికి వస్తే ఈ విషయాన్ని చూపుతామన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మరోసారి అడ్డుపడ్డారు. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో రైతులు కేసీఆర్ కు పాలాభిషేకాలు చేశారన్నారు. ఏదో ఉపద్రవం వచ్చినప్పుడు కొంత నష్టం జరుగుతుందన్నారు. చెక్ డ్యామ్ లతో కేసీఆర్ కు పేరొచ్చిందని బురద చల్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తుందని కౌంటర్ చేశారు.
అదే సమయంలో మరో మంత్రి హరీష్ రావు కూడ ఈ సమయంలో జోక్యం చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్ వద్దని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.చెక్ డ్యామ్ లు వద్దని శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారన్నారు. మరో కాంగ్రెస్ నేత ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేశారని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటో చెప్పాలన్నారు. చెక్ డ్యామ్ లు కావాలంటే బీఆర్ఎస్ ను, వద్దంటే కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు. మంత్రి హరీష్ రావు మాట్లాడిన తర్వాత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. అశాస్త్రీయంగా చెక్ డ్యామ్ ల నిర్మాణం వల్ల నష్టం జరిగిందని తమ పార్టీ ఎమ్మెల్యే చెప్పారన్నారు.
చెక్ డ్యామ్ లు వద్దని తాము చెప్పలేదన్నారు. ఈ విషయమై మంత్రి హరీష్ రావు మరోసారి జోక్యం చేసుకున్నారు. చెక్ డ్యాం లు వద్దని శ్రీధర్ బాబు వద్దని చెప్పారన్నారు. రికార్డులు వెరిఫై చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు వర్షాలు, వరదపై మాట్లాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తాను అనని మాటలను అన్నట్టుగా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నించారన్నారు. అశాస్త్రీయంగా చెక్ డ్యామ్ లు కట్టవద్దని కోరినట్టుగా శ్రీధర్ బాబు చెప్పారు. ఈ సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం శాస్త్రీయంగా ఎలా నిర్మించలేదో చెప్పాలన్నారు. ఈ విషయమై సభ కమిటీ వేస్తే నిరూపిస్తామన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.