TSRTC: మహిళలకు రేపటి నుంచి జీరో టికెట్లు.. గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

By Mahesh K  |  First Published Dec 14, 2023, 10:04 PM IST

టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం కింద బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లకు జీరో టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయనుంది. వీరంతా తమ వెంట గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని, విధిగా జీరో టికెట్ తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
 


హైదరాబాద్: తెలంగాణలో మహాలక్షి పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. మొదటి రోజు నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. కొన్ని రోజులు ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి.. ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మహిళా ప్రయాణికులకు జీరో టికెట్లు అందించబోతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీరో టికెట్లను విధిగా తీసుకుని సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు తప్పకుండా తమ వెంట ఆధార్, ఓటర్, పాన్, ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకదానిని తెచ్చుకోవాలని కోరారు.

మహిళలకు జీరో టికెట్లు అందించడంపై ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి అధికారులతో వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన వస్తున్నదని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా విజయవంతంగా అమలవుతున్నదని సజ్జనార్ తెలిపారు. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, నిరాటంకంగా అమలు చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను కూడా సంస్థ అప్‌డేట్ చేసినట్టు వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను టిమ్ మెషిన్‌లలో ఇన్‌స్టాల్ చేస్తున్నట్టు తెలిపారు. 

Latest Videos

Also Read: Yearender2023: ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎన్ని గెలిచింది?

శుక్రవారం నుంచి ఈ టిమ్ మెషిన్ల నుంచి జీరో టికెట్లు జారీ చేస్తామని సజ్జనార్ వివరించారు. బస్సులో వెళ్లుతున్న మహిళలు విధిగా జీరో టికెట్ కండక్టర్ నుంచి తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే.. మహిళలకు మరో కీలక సూచన కూడా చేశారు. మహిళా ప్రయాణికులు ఆధార్, ఓటర్ లేదా ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకదానిని వెంట తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించాలని, తర్వాత తప్పకుండా జీరో టికెట్ తీసుకోవాలని పేర్కొన్నారు.

click me!