ఆర్టీసీ విలీనం ప్రస్తుతానికి వద్దు.. మిగిలిన డిమాండ్లు తేల్చండి: అశ్వత్థామరెడ్డి

By sivanagaprasad KodatiFirst Published Nov 14, 2019, 8:51 PM IST
Highlights

ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.

ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విలీనం అంశం విఘాతం కలిగిస్తుందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ నేపథ్యంలోనే విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదే సమయంలో మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని కోరుతున్నామని... ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఆత్మస్ధైర్యాన్ని కోల్పోవద్దని.. శుక్రవారం డిపోల నుంచి గ్రామాలకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

16న నిరవధిక దీక్ష, బస్సులను ఆపే కార్యక్రమం, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్ టూ కోదాడ బంద్ నిర్వహిస్తామన్నారు. చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.

Also Read:కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ: రూట్ల ప్రైవేటీకరణపై స్టే

రేపో ,ఎల్లుండి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్ ను కలుస్తామని.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు,కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని అశ్వత్థామరెడ్డి ధ్వజమెత్తారు.

ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని.. సడక్ బంద్ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని అశ్వత్థామరెడ్డి విజ్ఙప్తి చేశారు. 

ఆర్టీసీ ప్రైవేటీకరణపై  గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై  సుధీర్ఘంగా విచారణ చేసింది హైకోర్టు.ఈ విచారణ సందర్భంగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన ప్రోసీడింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు గురువారం నాడు సీల్డ్ కవర్లో ఉంచింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరించాలని  తెలంగాణ కేబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. అయితే ఈ విషయమై జీవో వచ్చిన తర్వాత అమలు చేస్తామని  రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు వివరించారు.

Also Read:ఆర్టీసీ సమ్మె: సెప్టెంబర్ జీతాలపై హైకోర్టు విచారణ వాయిదా

ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఉంచకుండా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎలా తీసుకొంటారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్‌లో మార్పులు చేర్పులను చేయాలని కూడ పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.

ఈ ఏడాది నవంబర్ రెండో తేదీన ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకొంది. అయితే  కేబినెట్ తీసుకొన్న నిర్ణయం కేంద్రప్రభుత్వం చేసిన మోటార్ వాహన చట్టంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న చట్టాలకు విరుద్దంగా ఉందని కూడ హైకోర్టు వ్యాఖ్యానించింది.

click me!