Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?

By Mahesh K  |  First Published Dec 11, 2023, 12:29 AM IST

నిజామాబాద్‌లోని బోధన్ డిపో పరధిలో ఇద్దరు మహిళలకు కండక్టర్ టికెట్లు ఇచ్చిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ దర్యాప్తు చేపట్టింది. కండక్టర్ ఉద్దేశపూర్వకంగా మహిళలకు టికెట్లు ఇవ్వలేదని తేలింది.
 


హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచి విచారణ జరిపారు. ఆయన మహిళలకు టికెట్లు ఎందుకు ఇచ్చాడు అనే విషయంపై స్పష్టత వచ్చింది.

నిజామాబాద్ - బోధన్ రూట్‌లో నడుస్తున్న పల్లె వెలుగు బస్సులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. అందులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బస్సు ఎక్కిన తర్వాత పురుషు ప్రయాణికుడు ముగ్గురికి బోధన్ టికెట్ ఇవ్వాలని కండక్టర్‌ను కోరాడు. కండక్టర్ రూ. 30 చొప్పున ముగ్గురికి రూ. 90 తీసుకుని ముగ్గురికీ టికెట్లు ఇచ్చారు. కొంతసేపటికి నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత ఆ పురుష ప్రయానికుడు కండక్టర్ వద్దకు వచ్చి.. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం కదా.. మరి ఈ ఇద్దరు మహిళలకు టికెట్ ఎందుకు జారీ చేశారని అడిగారు.

Latest Videos

Also Read: Revanth Anna: రేవంత్ అన్నా.. రేవంత్ అన్నా! పిలిచి సమస్య చెప్పిన మహిళ, అధికారులకు సీఎం ఆదేశం.. వైరల్ వీడియో ఇదే

అయితే, ఆ ముగ్గురు ప్రయాణికులూ పురుషులేనని భావించి, మూడు టికెట్లు జారీ చేశానని, అంతేకానీ, వేరుగా అనుకోరాదని కండక్టర్ వారికి చెప్పారు. వెంటనే ఆ టికెట్ తీసుకుని డబ్బులు తిరిగి ఇచ్చారు. ఈ ఘటనలో కండక్టర్ ఉద్దేశపూర్వకంగా మహిళలకు టికెట్లు ఇవ్వలేదని తేలిందని టీఎస్ఆర్టీసీ ఎండీ ఆఫీసు అధికారిక ఎక్స్ హ్యాండిల్ వెల్లడించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం ప్రశాంతంగా అమలవుతోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం నిరాటంకంగా సాగుతున్నదని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ అవగాహన కల్పించామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించింది. ప్రజలంతా సహకరించాలని సంస్థ కోరుతున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

Also Read: India Bloc: మళ్లీ ఇండియా కూటమి హడావిడి.. 19న ఢిల్లీలో భేటీ, సీటు షేరింగ్‌పై డిస్కషన్!

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మీ హామీ కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉన్నది. ఈ హామీని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

click me!