ఉక్రెయిన్ నుంచి తిరిగివస్తున్నవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..

By Sumanth KanukulaFirst Published Mar 1, 2022, 9:33 AM IST
Highlights

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో స్వదేశానినికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఉక్రెయిన్ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్న విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో స్వదేశానినికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. Ukraine సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరిలకు చేరుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేక విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. అయితే స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వస్థలాలకు తరలిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ఎలాంటి ఖర్చు లేకుండా ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాష్ట్రానికి తరలిస్తుంది.  

ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తెలంగాణ సెక్రటేరియట్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఉక్రెయిన్‌లో ఉన్న తెలంగాణ విద్యార్థులతో కూడా అధికారులు టచ్‌లో ఉన్నారు. 

Latest Videos

ఇక, ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులను అధికారులు పికప్ చేసుకుంటున్నారు. ఇందుకోసం New Delhi, Mumbai. విమానాశ్రయాల్లో ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీరికి ప్రభుత్వమే విమాన టికెట్లను బుక్ చేసి హైదరాబాద్ విమానాశ్రయానికి తరలిస్తున్నారు. 

ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి..
ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నవారిని రాష్ట్రంలోని స్వస్థలాలకు వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాలయం కల్పించింది. శంషాబాద్ నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు చేరుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపింది. మార్గమధ్యలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఎక్కి ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) సోమవారం ప్రకటన చేశారు. ఇందుకోసం ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టుగా ఏదైనా ఆధారం చూపెడితే సరిపోతుంది. 

ఇక, ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఉక్రెయిన్‌లో వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న తెలంగాణకు చెందిన 53 మంది విద్యార్థులను రాష్ట్రానికి వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్న విద్యార్థులకు MLA Prakash Goud Garu, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. 

click me!