తెలంగాణలో గ్రూప్-4 పరీక్షను ఈ ఏడాది జూలై 1వ తేదీన నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది
హైదరాబాద్: ఈ ఏడాది జూలై 1వ తేదీన టీఎస్‌పీఎస్ సీ గ్రూప్ -4 ;పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. రాష్టంలో 8,180 ఉద్యోగాలను గ్రూప్ -4 కింద భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా డిమాండ్ ఉండడంతో ఈ నెల 3వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకొనేందుకు గడువును ఇచ్చింది టీఎస్‌పీఎస్ సీ. వాస్తవానికి గత నెల 30వ తేదీతోనే గడువును ముగించారు. కానీ అభ్యర్ధుల డిమాండ్ నేపథ్యంలో మరోసారి గడువును పెంచారు. గ్రూప్ -4 ఉద్యోగాల కోసం ఇప్పటికే 9 లక్షల మందికి పైగా అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. గడువు పెంచడంతో ఇంకా ధరఖాస్తుల సంఖ్య పెరగనుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీన ఉదయం 10 గంటలనుండి పేపర్ -1, మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి పేపర్ -2 ను నిర్వహించనున్నారు.
మరో వైపు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల తేదీలను రెండు రోజుల క్రితం టీఎస్ పీఎస్ సీ ప్రకటించింది. జూన్ 5 నుండి జూన్ 12 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.