తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. మున్సిపల్ శాఖలో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

By Siva KodatiFirst Published Sep 7, 2022, 8:38 PM IST
Highlights

మున్సిపల్ శాఖలోని 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలను భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. 

నిరుద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్.  వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తోన్న కమీషన్.. తాజాగా మంగళవారం మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మున్సిపల్ శాఖలోని 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. 

ఇక.. వివిధ శాఖల్లో వున్న 1540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి 14 వరకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అలాగే ఈ నెల 5న 23 తెలంగాణ మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారుల పోస్టుల భర్తీకి కూడా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కమీషన్ పేర్కొంది. 

Also REad:తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1,540 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

మరోవైపు.. తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్‌ల విడుదలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ శాఖల అధికారులతో టీఎస్‌పీఎస్సీ సమావేశమైంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం అన్ని విభాగాల హెచ్‌వోడీలతో టీఎస్‌పీఎస్సీ సమావేశమైంది. అన్ని శాఖల్లో ఇండెంట్లను అందించాలని కమీషన్ కోరింది. కాగా.. గత రెండు రోజులుగా వ్యవసాయ, కళాశాల విద్య, గిడ్డంగుల సంస్థ, మత్య్స, సహకార, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. సర్వీస్ రూల్స్, సవరణలు, రోస్టర్స్, క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతల వివరాలను తమకు అందించాలని ఛైర్మన్ కోరారు. 

కాగా.. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా  ప్రకటించారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగాల భర్తీపై దృష్టి చేశారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

click me!