నమ్మకం లేదు, విచారణకు రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ

By narsimha lode  |  First Published Mar 24, 2023, 9:21 AM IST

బీజేపీ  తెలంగాణ   రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  ఇవాళ  సిట్  కు లేఖ రాశారు.  


హైదరాబాద్: సిట్  కు  బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారంనాడు లేఖ రాశారు.  సిట్  పై తనకు  నమ్మకం లేదని   చెప్పారు.  తనకు  నమ్మకం  ఉన్న సంస్థలకే  తన వద్ద  ఉన్న సమాచారం ఇస్తానని  బండి సంజయ్  చెప్పారు.  ఈ విషయమై తనకు  స్వేచ్ఛ ఉందన్నారు.  తనకు  సిట్  నోటీసులు  కూడా అందలేదని కూడా  ఆ లేఖలో బండి సంజయ్ గుర్తు  చేశారు.  మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా  తాను  ఈ విషయమై స్పందిస్తున్నట్టుగా  బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెల  24న విచారణకు  రావాలని మీడియాలో  వార్తలు  చూసినట్టుగా బండి సంజయ్ చెప్పారు. 

ఎంపీగా  తాను  పార్లమెంట్ కు  హాజరు కావాల్సి ఉందన్నారు. తాను కచ్చితంగా  సిట్ విచారణకు  హాజరు కావాలని సిట్ భావిస్తే  మరో తేదీని చెప్పాలని ఆ లేఖలో బండి సంజయ్ సిట్ ను కోరారు.

Latest Videos

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్  కేసులో  తన వద్ద   ఉన్న సమాచారం సిట్ కు ఇవ్వాలనుకోవడం లేదని  బండి  సంజయ్ ఆ లేఖలో  తేల్చి చెప్పారు. పేపర్ లీక్  అంశాన్ని సిట్టింగ్  జడ్జితో  విచారణ  జరిపించాలని  బండి  సంజయ్ డిమాండ్  చేశారు.

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  అంశానికి సంబంధించి  బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు  చేశారు.  ఈ విషయమై  తన  వద్ద  ఉన్న సమాచారం  ఇవ్వాలని  బండి సంజయ్ కు  ఈ నెల  21న  సిట్  అధికారులు నోటీసులు  ఇచ్చారు.

గ్రూప్ -1  ప్రిలిమ్స్   పరీక్షలో 50 మంది అభ్యర్ధులకు  100కు పైగా మార్కులు  వచ్చాయని  బండి  సంజయ్  ఆరోపించారు.  ప్రశ్నాపత్రం లీక్  అంశానికి  సంబంధించి  ఆరోపణలు  చేశారు.ఈ విషయమై   సమాచారం ఇవ్వాలని సిట్ అధికారులు బండి సంజయ్  నివాసం ఉండే  ఇంటికి  నోటీసులు  అంటించారు. 

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్

సిట్  నోటీసులు  తనకు  అందలేదని  బండి  సంజయ్  పేర్కొన్నారు. ఉగాది  రోజున  మీడియాతో  కూడా  ఈ విషయాన్ని బండి  సంజయ్  చెప్పారు. సిట్  పై బండి సంజయ్  విమర్శలు  చేశారు. సిట్ అంటే సిట్ , స్టాండ్  అంటూ   బండి  సంజయ్  ఎద్దేవా చేశారు.  

  బండి సంజయ్  రాసిన లేఖపై  సిట్  ఏ రకంగా  స్పందిస్తోందో చూడాలి. టీఎస్‌పీఎస్‌సీ   ప్రశ్నాపత్రం లీక్  అంశంపై  విపక్షాలు  రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు  చేస్తున్నాయి. ఇదే  విషయమై  సిట్  విచారణకు  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి హాజరయ్యారు.  పేపర్ లీక్ అంశానికి  సంబంధించి  రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు  ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ అంశంపై మాట్లాడిన  మంత్రి కేటీఆర్ ను కూడా  విచారించాలని  రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు.  

click me!