
సిద్దిపేట : ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో కలకలం రేపింది. పెళ్లయి పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం అతని ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ కు చెందిన లగిశెట్టి అభిషేక్ (19) డిగ్రీ చదువుకుంటున్నాడు. హైదరాబాదులోని సుచిత్ర ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నాడు. అక్కడే అతడికి ఓ వివాహితతో పరిచయమయ్యింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే ఆ వివాహిత ఇటీవల మరొకరితో చనువుగా ఉంటుంది. అది అభిషేక్ సహించలేకపోయాడు. మానసికంగా కృంగిపోయాడు. దీంతో మంగోల్ లోని తమ పొలంవద్ద ఈనెల 17న పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స తీసుకుంటూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
పేపర్ లీక్ కేసు.. సమగ్ర నివేదిక ఇవ్వండి : సీఎస్, డీజేపీ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌లకు తమిళిసై లేఖ
ఇదిలా ఉండగా, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ దారుణమైన ఘటన తిరుపతిలో మార్చి 4న వెలుగు చూసింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగున్న నేరాల సంగతి తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాం. భర్తనో.. భార్యనో... ప్రియుడినో... మిగతా వారు హతమార్చడం... ఆ తరువాత బయపడి వారూ అరెస్ట్ కావడం చూస్తుంటాం. అయితే, తిరుపతిలో జరిగిన ఓ ఘటన విన్నవారందరూ ముక్కున వేలేసుకునేలాగా ఉంది. తప్పు చేసిన వ్యక్తే... తిరగబడి బాధితుడి మీద దాడికి దిగాడు. తీవ్ర స్థాయిలో అవమానానికి గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెడితే.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్త దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా చేయడం వల్ల మామూలుగా అయితే అవమానకరంగా ఫీల్ అయ్యి.. ఆ సంబంధానికి దూరంగా ఉంటారని భావించాడు ఆ భర్త. కానీ, ఆ ప్రియుడు మాత్రం ఆ భర్త మీద ప్రతీకార చర్యకు దిగాడు. తమ సంబంధాన్ని భర్త బయట పెట్టడం భరించలేకపోయాడు. పైశాచికంగా వ్యవహరించాడు. ఆ భర్తకి శిరోమండనం చేయించడమే కాకుండా.. అతని మీద మూత్రం పోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
తిరుపతిలోని చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు.... హర్షవర్ధన్ అనే వ్యక్తి గురించి ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. సదరు హర్షవర్ధన్ అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని… RIP (రిప్) అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఇది సదరు ప్రియుడు హర్షవర్ధన్ చూసాడు. కోపంతో రగిలిపోయాడు. తనమీద అలా పెట్టిన వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. సదరుబాదితుడిని పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి గుండు కొట్టించాడు.
అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. అతని మీద మూత్రం పోసాడు. అంతేకాదు దీనికి సంబంధించి పోలీసులకు గనక ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు చోద్యం చూస్తూ నిలబడ్డారే కానీ.. ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఫోటోలు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. విషయం పోలీసుల దాకా చేరింది. వెంటనే దీనిమీద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు.
హర్షవర్ధన్ తో పాటు, అతని అనుచరుడైన అన్వర్ ను.. ఈ ఘటనలో వీరికి సహకరించిన మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే దారుణం.. అయితే ఆ ప్రియుడు తన మీద దాడి చేయడం.. మరింత అవమానం దీన్ని తట్టుకోలేక ఆ భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం.