టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్..

By Sumanth KanukulaFirst Published Mar 18, 2023, 2:28 PM IST
Highlights

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో 9 మంది నిందితులకు కోర్టు ఆరు రోజుల కస్టడీకి శుక్రవారం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం సిట్‌ అధికారులు.. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం వారిని విచారణ నిమిత్తం తరలిస్తారు. నేటి నుంచి మార్చి 23 వరకు నిందితులు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉంది. 

ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్, రాజశేఖర్, రేణుకల నుంచి సిట్ అధికారులు మరింత సమాచారం సేకరించనున్నారు. ఇందుకోసం వారిని వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు.. చెబుతున్న విషయాలను సరిపోల్చనున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్‌లొ భాగంగా.. వారి మొబైల్ ఫోన్స్‌కు సంబంధించిన డేటాను కూడా విశ్లేషించనున్నారు. అలాగే పేపర్ లీక్‌కు సంబంధించి మిగిలిన నిందితుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌కు ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వం మహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు గత అక్టోబరు నుంచే పలు పరీక్షలకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగిలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసినట్టుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదని అధికారులు నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే నిందితులు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదిక‌తో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. 

click me!